ఇల్లరికంలో ఉంది మజా!

4 Sep, 2017 01:06 IST|Sakshi
ఇల్లరికంలో ఉంది మజా!
అత్తారింటికి దారి.. కడియపు సావరం!
 
ఉపాధి కరువై.. బతుకు భారమై.. ఉన్న ఊరిని వదిలి వలస వచ్చేస్తున్నవారికి ఆ ఊరు.. కల్పవృక్షం. ఏడాదిలో 365 రోజులూ చేతి నిండా పని, రెండు చేతులా సంపాదిస్తూ శ్రీమంతులు కావాలంటే ఆ ఊరిలో అడుగుపెట్టాల్సిందే.. అంతేనా చక్కనైన కుందనపు బొమ్మల్లాంటి యువతులను పెళ్లి చేసుకోవడానికి దారీ అదే‘ఇల్లరికంలో ఉంది మజా’ అంటూ పాటేసుకుంటూ.. ఆ మజాను ఆస్వాదించాలన్నా ఆ ఊరికి దారి తీయాల్సిందే..పూల మొక్కలతో.. నర్సరీలతో అలరారే ఆ అందమైన ఊరు.. కడియపు సావరం.. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ కుగ్రామం ఇల్లరికపు అల్లుళ్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా భాసిల్లుతోంది.. 
 
ఇల్లరికం వచ్చిన అల్లుళ్లు ఆ గ్రామంలోని పూల మొక్కలు, నర్సరీల్లోని పనులను ఆలంబనగా చేసుకుని 365 రోజులూ పనులు చేసుకుంటున్నారు. రోజుకు రూ.300 నుంచి రూ.500 సంపాదిస్తూ భార్యాభర్తలిద్దరూ ఆడుతూపాడుతూ పనులు చేసుకుంటూ సంపన్నులవుతున్నారు. వ్యాపారాలు చేస్తున్నారు.. పొలం, పుట్ర కొనుక్కుంటున్నారు.. ఇళ్లు కట్టుకుంటున్నారు.. పిల్ల లకు ఉన్నత విద్యను అందిస్తున్నారు. స్వగ్రామంలో పూట గడవని స్థితిని ఎదుర్కొన్న వీరంతా కడియపు సావరంలో కాలరెగరేసుకుని జీవిస్తున్నారు. మొత్తంగా కడియపు సావరం ప్రజలు తమ గ్రామ అల్లుళ్లకు నర్సరీలు, పూలమొక్కల పెంపకం పనులు ఇస్తూ, వ్యాపార అవకాశాలు కల్పిస్తూ సాదర ఆహ్వానం పలుకుతున్నారు. ఇలా ఆ గ్రామం ఇల్లరికం అనే పదానికి అర్థాన్నే మార్చేసింది. 
 
వివాహాలు ఇలా ప్రారంభం..
ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కుటుంబాలు అక్కడే ఏళ్ల తరబడి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వీరిలో బుద్ధిమంతులైన కొందరు యువకులకు ఆ గ్రామంలోని రైతులు తమ కుమార్తెలను ఇచ్చి వివాహం చేయడం ప్రారంభమైంది. అలాగే ఇతర ప్రాంతాల యువకులకు తమ కుమార్తెలను ఇచ్చి వివాహం జరిపించిన రైతులు వారినీ తమ గ్రామానికి రప్పించుకున్నారు. ఇలా ఉపాధిని వెతుక్కుంటూ సుమారు 500 నుంచి 700 మంది వరకు అల్లుళ్లు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో కుగ్రామమైన కడియపు సావరంలో గత కొన్నేళ్ల నుంచి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.
 
చేతినిండా పని.. బతుకుపై భరోసా
కడియం మండలంలోని అనేక గ్రామాల ప్రజలకు పూలు, పండ్లు, కూరగాయ మొక్కల పెంపకం, నర్సరీలే జీవనాధారం. ఆ మండలంలోని 13 గ్రామాల్లో ఏడు వందల నర్సరీలు ఉన్నాయి. వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు మొక్కలను విక్రయిస్తున్నారు. వీటితోపాటు కల్యాణ మండపాలు, ల్యాండ్‌ స్కేపింగ్, గ్రీనరీ అభివృద్ధి వంటి అనేక రకాల పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఎంత సంపాదించినా స్త్రీ, పురుష అనే భేదం లేకుండా రోజుకు రెండు మూడు గంటలు నర్సరీలో పనిచేయాల్సిందే. చేతినిండా పని, బతుకుపై భరోసా కల్పిస్తుండటంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం నుంచి వేలాది మంది కార్మికులు వలస వచ్చారు. మరోవైపు సమాజం ఆధునిక పోకడల వైపు పయనిస్తుండటంతో ఇక్కడి యువత కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ వరకు చదువుకున్న యువత పూల మండపాల అలంకరణపై దృష్టి పెడుతోంది. ఉపాధి, ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలకు పోకుండా ఇక్కడే ఉండి విభిన్న రీతుల్లో మండపాలను రూపొందిస్తున్నారు. 
 
ఇద్దరం కష్టపడుతున్నాం
మాది అల్లవరం మండలం గూడతిప్ప. పదేళ్ల క్రితం పెళ్లైంది. మా అత్తగారి ఊరు కడియపు సావరం. మా ఏరియాలో పనులు తగ్గిపోవడం, కూలీ గిట్టుబాటు కాకపోవడంతో పెళ్లైన కొత్తలోనే ఇక్కడకు వచ్చేశాం. ఇద్దరం కష్టపడుతున్నాం. చేతినిండా పని దొరుకుతోంది. నేను వ్యవసాయ పనుల్లోకి వెళుతుంటే, మా ఆవిడ వెంకట లక్ష్మి పూలు గుచ్చి రైతులకు అందిస్తోంది. ఇటీవలే మేం సంపాదించుకున్న డబ్బులతో ఇల్లు కట్టుకున్నాం. మేం చాలా ఆనందంగా జీవిస్తున్నాం. ఈ ఊరు మాకు బతుకుపై భరోసా కల్పించింది.
– డాబా లక్ష్మణస్వామి, కడియపు సావరం
మరిన్ని వార్తలు