కైకలూరు కుర్రాడు

21 Jul, 2014 03:21 IST|Sakshi
కైకలూరు కుర్రాడు
  • ‘గీతాంజలి’ సినిమాకు కథా రచయిత, దర్శకత్వ బాధ్యతలు
  •  ఫొటోగ్రాఫర్ నుంచి సినీ దర్శకుడిగా ఎదిగి..
  •  త్వరలో మరో మూడు సినిమాలు
  •  కైకలూరుకు చెందిన రాజ్‌కిరణ్ విజయ గాథ
  •  
     రెడీ.. వన్.. టు.. త్రీ.. యూక్షన్..


    ఒకనాడు కైకలూరు రహదారులపై కెమేరాలు పట్టుకుని ప్రోగ్రామ్‌ల కోసం తిరిగిన ఓ కుర్రాడు.. నేడు సినీ పరిశ్రమలో ప్రతిభ గల దర్శకుడిగా మారాడు. ఒకప్పుడు పేదరికంతో కుటుంబ భారాన్ని మోసిన ఆ యువకుడు.. ‘విశ్రాంతి’ లేకుండా పనిచేసి ఇప్పుడు ఎంతోమంది సినీ దిగ్గజాలతో సరికొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ప్రతిభనే పబ్లిసిటీగా.. ఆలోచనలనే కథలుగా మలిచి ‘గీతాంజలి’గా మన ముందుకు రాబో   తున్నాడు. దర్శకుడిగా ఎన్ని టేక్‌లు చెప్పినా.. నిజ జీవితంలో వెనుదిరిగి చూడకుండా ‘శుభం’ కార్డు వేయించుకున్నాడు. మరి ఆ కైకలూరు కుర్రాడి కథమిటో చదవండి...
     
     కైకలూరు : తండ్రి ఓ సాధారణ మెకానిక్. కుటుంబపోషణ అంతంత   మాత్రం. ఓపక్క చదువు, మరోపక్క ఇంటి బాధ్యతలు. ఏం చేయలేని పరిస్థితిలో ఫొటోగ్రాఫర్‌గా మారాడు కైకలూరుకు చెందిన పిల్లి బాలాజీ. తల్లిదండ్రులు మెహినీప్రసాద్, చంద్రకాంతం. ఓ తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. పెద్ద కుటుంబం కావడంతో చిన్న వయసులోనే బాధ్యతలు చుట్టుముట్టాయి. దీంతో కైకలూరులో పదిహేనేళ్ల కిందట బాలాజీ మ్యూజికల్ నైట్స్ స్థాపించాడు. ఊరూరా తిరుగుతూ వచ్చిన కొద్దిపాటి మొత్తంతోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొద్దికాలానికే ఆ ఉపాధి కూడా కరువైంది. చేసేదేమీలేక పొట్ట చేతపట్టుకుని హైదరాబాద్ వెళ్లాడు. రాజ్‌కిరణ్‌గా పేరు మార్చుకుని సినిమా కథా రచయిత, దర్శకుడిగా మారి తన ప్రతిభ చాటుతున్నాడు. అంతేకాదు..   కైకలూరులో సాయిబాబా మందిరాన్ని ఏర్పాటుచేసి సొంత ఊరుపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు.
     
     సహనంతోనే ఏదైనా సాధించగలం..

     చిన్నతనం నుంచి అనేక కష్టాలు అనుభవించాను. రోజు ఎలా గడుస్తుందా అనే పరిస్థితి మాది. సినిమాలంటే ప్రాణం. మక్కికిమక్కీగా పాటలు పడేవాడ్ని. భీమవరం కేజీఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడు హాస్యనటుడు ఎంఎస్ నారాయణ పరిచయమయ్యారు. సినిమాలకు వస్తానంటే ఇప్పుడు వద్దన్నారు. అయినా కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయూను. ఎంఎస్ నారాయణ తిరిగి వెళ్లిపోమన్నారు. పట్టు విడవకుండా పదేళ్లు కష్టపడ్డాను. వీఆర్ ప్రతాప్, రాజా వన్నెంరెడ్డి, రవిరాజా పినిశెట్టి వంటి దర్శకుల వద్ద పనిచేశాను. 2004లో ఉషాకిరణ్ మూవీస్‌కు పనిచేసే అవకాశం వచ్చి చేజారిపోయింది. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) నన్ను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. గీతాంజలి కథలో భయంతో పాటు హాస్యం కూడా ఉంటుంది. మరో మూడు సినిమాలకు అవకాశం వచ్చింది. కైకలూరు ప్రజలను ఎప్పటికీ మరిచిపోలేను. సహనంతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చనడానికి నా కథే ఉదాహరణ.    
    - రాజ్‌కిరణ్
     
     ‘గీతాంజలి’ సినిమాకు కథా రచయిత, దర్శకుడిగా..

     ఎంవీవీ సినిమా బ్యానర్‌పై ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఫేం అంజలి ప్రధాన పాత్రలో, హర్రర్, కామెడీనే ఇతివృత్తంగా రాజ్‌కిరణ్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘గీతాంజలి’. ఈ సినిమాకు ఆయనే కథ అందించారు. ప్రముఖ రచయిత, దర్శకుడు కోన వెంకట్ సమర్పణలో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. సంగీతం ప్రవీణ్ లక్కరాజు.  బ్రహ్మానందం, హర్షవర్ధన్ రాణే, శ్రీనివాసరెడ్డి, రావు రమేష్, సత్యం రాజేష్  ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల ఆడియో ఫంక్షన్ జరుపుకొన్న ఈ చిత్రం ఆగస్టు మొదటి వారంలో విడుదల కానుంది.
     

మరిన్ని వార్తలు