దీపారాధనతో లోకశాంతి

21 Nov, 2014 00:24 IST|Sakshi
దీపారాధనతో లోకశాంతి

రావివలస(టెక్కలి): ప్రతి ఇంటిలో భగవంతునికి దీపాన్ని వెలిగించి ఆరాధిస్తే ఆ కుటుంబానికే మంచిదని, మహా పుణ్య క్షేత్రాల్లో దీపాలు వెలిగిస్తే ఆయా వంశంతో పాటు లోకశాంతి జరుగుతుందని విశాఖపట్టణం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. టెక్కలి మండలం రావివలస గ్రామంలోని ఎండల మల్లికార్జున స్వామి ఆలయ సన్నిధిలో గురువారం ‘కైలాస ప్రస్థార ప్రయుక్త యంత్రం లక్షదీపారాధన’ కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథ/గా హాజరైన  స్వరూపానందేంద్ర స్వామిజీ దీపారాధన ప్రాధాన్యాన్ని భక్తులకు వివరించారు.  
 
 హృదయంలోని దివ్యజ్యోతి స్ఫూర్తితో భగవంతునికి వెలుగు రూపంలో వెలిగించేది దీపారాధనగా పేర్కొన్నారు. పవిత్రమైన హిందూమతంలో ప్రతిచిన్న శుభకార్యానికి దీపాన్ని వెలిగించి భగవంతున్ని ప్రార్థించడం సాంప్రదాయమన్నారు. జీవన్ముక్తి స్థితితో దీపాన్ని వెలిగిస్తే ముక్తి కలుగుతుందన్నారు. దీపాన్ని వెలిగించే మతం హిందూమతం అని, దీపాలు ఆర్పే మతం విదేశీ మతంగా పేర్కొన్నారు. మల్లన్న సన్నిధిలో కైలాస ప్రస్థార యంత్రంతో నిర్వహించిన దీపారాధనలో పాల్గొన్న భక్తులు ఎంతో అదృష్టవంతులన్నారు. ఆరేళ్ల కిందట ఈ దేవస్థానాన్ని సందర్శించిన తరువాతే తనకు శక్తివంతమైన పేరు ప్రఖ్యాతలు వచ్చాయాన్నరు.
 
 అనంతరం మొదటి దీపాన్ని వెలిగించి లక్ష దీపారాధన కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ నిర్వాహకులు మల్లన్న చిత్రపటాన్ని స్వరూపానందేంద్ర సరస్వతికి జ్ఞాపికగా అందజేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 275 కుటుంబాలు హాజరై లక్షదీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆనందాశ్రమం నిర్వాహకుడు శ్రీనివాసానంద స్వామి, దేవాదాయ శాఖ ఏసీ శ్యామలాదేవి, సూపరింటెండెంట్ పరమహంస, సంతబొమ్మాళి జెడ్పీటీసీ సభ్యురాలు లమ్మత లక్ష్మి, రావివలస సర్పంచ్ బడే జగదీష్, నిర్వాహకులు ఎల్.ఎల్.నాయుడు, లమ్మత మధు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు తల్లి విజయలక్ష్మి, దేవస్థానం ఈవో జి.గురునాథరావుతో పాటు 16 మంది రుత్వికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు