1న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానం

30 Oct, 2017 01:46 IST|Sakshi

సాక్షి, తిరుమల : నవంబర్‌ 1న కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించనున్నారు. స్థితికారుడైన మహావిష్ణు వును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు. కైశిక ద్వాదశి మహోత్సవాన్ని టీటీడీ ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుంది.

స్నపనమూర్తిగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి, భూదేవి సమేతంగా కైశిక ద్వాదశి రోజు మాత్రమే తెల్లవారుజామున 4.30 నుంచి 5.30 గంటల్లోపు ఆలయ అర్చకులు తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు కైశిక ద్వాదశి ఆస్థానాన్ని పురాణ పారాయణం ద్వారా నిర్వహిస్తారు. ఆ రోజు సుప్రభాతం, తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఆరోజు వారపు ప్రత్యేక సేవ సహస్రకలశాభిషేకాన్ని టీటీడీ రద్దు చేసింది.

మరిన్ని వార్తలు