రీచ్‌... ఫెస్టివల్‌

19 Dec, 2017 07:56 IST|Sakshi

నేడే సాగర తీరాన ఆనందాల హరివిల్లు

కాకినాడకు చేరుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శైలజ

ముమ్మర ఏర్పాట్లు

మంగళవారం సాయంత్రం నుంచి కాకినాడ సాగర తీరాన జరగనున్న బీచ్‌ ఫెస్టివల్‌కు సర్వం సిద్ధమవుతోంది. లక్షలాదిగా తరలిరానున్న ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. తొలిరోజున ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రముఖ సినీ నేప«థ్య గాయకుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ కాకినాడకు సోమవారం రాత్రి చేరుకున్నారు.  

కాకినాడ రూరల్‌: సువిశాల సాగరతీరం కాకినాడ సొంతం. నిరంతరం అలల సవ్వడులతో, పాలనురగను పోలిన తరంగాలతో..  ఇసుక తిన్నెల అందాలతో అలరారే ఈ ప్రాంతం జిల్లాకే పెట్టని ఆభరణంగా అభివర్ణిస్తారు. అయితే పాలనా యంత్రాంగం దీనిని అభివృద్ధి చేసేలా ఆలోచిస్తే ప్రపంచ పర్యాటక పటంలో కాకినాడ స్థానం సుస్థిరమవుతుంది. కాకినాడ తీరాన్ని ఆనుకొని ఉన్న మడ అడవులు, సముద్రం మధ్యలో ఉన్న హోప్‌ఐలాండ్‌ ద్వీపం జిల్లాకే తలమానికంగా ఉన్నా వీటి అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించకపోవడంపై పర్యాటకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

కొరియాను పోలిన తీరం
మన తీర ప్రాంతం దక్షిణ కొరియాను పోలి ఉంది. అక్కడి బీచ్‌ అభివృద్ధి చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం వల్ల నిత్యం సందర్శకులతో కళకళలాడుతుంది. తద్వారా ఎంతో ఆదాయాన్ని సైతం సమకూర్చుకోగలుగుతోందని పర్యాటక శాఖ అధికారులు సైతం చెబుతుంటారు. ఆ తరహాలోనే కాకినాడ బీచ్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రతిపాదనలు సిద్ధం చేశామని నాలుగేళ్లుగా చెబుతూ వస్తున్నారు. మన జిల్లాలో సుమారు 160 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉంది. దీని అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలు వేయడం లేదనే చెప్పాలి.

అప్పటి ఎమ్మెల్యే కన్నబాబు చొరవతో..
కాకినాడ తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు వీలుగా 2013లో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత వైఎస్సార్‌ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు సాగరసంబరాల పేరుతో బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. దీంతో కాకినాడ బీచ్‌ అంతర్‌రాష్ట్ర ఖ్యాతిని సంపాదించింది. ఐదేళ్లుగా ఈ ప్రాంతానికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తున్నారు. ఇదే ప్రాంతంలో అప్పట్లోనే హరితా రిసార్ట్స్‌ పేరుతో ప్రత్యేక బీచ్‌ ఏర్పడడం దానిలో పర్యాటకశాఖ రూ.4.5 కోట్ల వ్యయంతో 18 ఏసీ కాటేజీలను నిర్మించి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చింది. అనంతరం ఈ ప్రాంతంలో 50 ఎకరాల్లో రూ.45 కోట్ల వ్యయంతో వివిధ రకాల భవనాలతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా పనులు చేట్టారు. అయినా పర్యాటకాన్ని అందిపుచ్చుకోవడంలో వెనుకబడ్డామనే చెప్పాలి.

అభివృద్ధి జరిగితే అద్భుతమే..
ఐ.పోలవరం మండలం భైరవపాలెం నుంచి కాకినాడ, ఉప్పాడ, అద్దరిపేటల మీదుగా విశాఖపట్నం వరకు ఎక్కడా వంపులు లేని తీరం ఈ జిల్లా ప్రత్యేకతగా చెప్పవచ్చు. కాకినాడ బీచ్‌లో సరైన సౌకర్యాలు లేకపోయినా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. శని, ఆదివారాల్లో అయితే బీచ్‌ ప్రాంతం ప్రజలు, పర్యాటకులతో నిండిపోతుంది. కొరియా తీరాన్ని పర్యాటకశాఖాధికారులు సందర్శించి ఆ తరహాలో అభివృద్ధి చేయగలిగితే పర్యాటకంగా ప్రాచుర్యం సాధించవచ్చంటున్నారు.

కానరాని సౌకర్యాలు
మన జిల్లాలో ఐదేళ్లుగా టూరిజంశాఖ ఆధ్వర్యంలో కాకినాడలో బీచ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ఫెస్టివల్‌ అయిన తరువాత దానిపై ఎటువంటి శ్రద్ధ కనబరచడంలేదు. జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నా వాటి అభివృద్ధి కోసం నిధులు వెచ్చించక పోవడం, కనీస సౌకర్యాలకు దూరంగా ఉండడంతో పర్యాటకుల సందర్శన తక్కువగా ఉంటోంది. హరితా రిస్టార్స్‌ బీచ్‌లో ఇప్పటికే బార్‌ అండ్‌ రెస్టారెంట్, మీటింగ్‌హాల్, జిమ్, 18 కాటేజీలు నిర్మించినా పూర్తిస్థాయిలో పర్యాటకులకు అందుబాటులో లేదనే చెప్పొచ్చు. ప్రస్తుతం బీచ్‌లో రూ.45 కోట్ల వ్యయంతో లేజర్‌షో, వాటర్‌ఫౌంటెన్, గ్యాలరీ కన్వెన్షన్‌ హాళ్లు, ల్యాండ్‌ స్కేపింగ్, సస్పెన్షన్‌ బ్రిడ్జి వంటి పనులు చేస్తున్నారు. పర్యాటకులకు నిత్యం తాగునీరు, ఆహారం అందించే ఫుడ్‌కోర్టులు, ఇతర షాపింగ్‌లు వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. బీచ్‌లో పడక కుర్చీలు, టెంట్లు, బీచ్‌ ప్రాంతంలో సీ మోటార్‌బైక్, వాటర్‌ స్కైయింగ్, తినుబండారాల స్టాల్స్, వాటర్‌ స్పోర్ట్స్‌ వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

రెండు నిమిషాల వ్యవధిలోనే షటిల్‌ సర్వీసులు
కాకినాడ రూరల్‌:  కాకినాడ సాగర తీరంలో ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు జరిగే బీచ్‌ ఫెస్టివల్‌కు వచ్చే  ప్రజలకు ఇబ్బంది లేకుండా షటిల్‌ సర్వీస్‌ ఏర్పాటు చేసినట్టు ఎస్పీ విశాల్‌గున్ని వివరించారు. బీచ్‌ ఫెస్టివల్‌ ప్రాంతాన్ని ఆయన సోమవారం సందర్శించి పరిశీలించారు. బీచ్‌లో వేదిక, ప్రత్యేక అతిథులు, అతిథుల గ్యాలరీ, పార్కింగ్‌ స్థలాలు, షాపింగ్‌ మాల్స్, ఇతర ప్రాంతాలన్నీ పరిశీలించి బీచ్‌ ఫెస్టివల్‌కు వచ్చిన ప్రజలకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. అనంతరం ఎస్పీ విశాల్‌ గున్ని మాట్లాడుతూ బీచ్‌ ఫెస్టివల్‌కు 1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఒక అడిషనల్‌ ఎస్పీ స్థాయి అధికారిని ట్రాఫిక్‌ పర్యవేక్షణకు నియమించామని, ఆయన ఆధ్వర్యంలో పార్కింగ్‌ తదితర అంశాలను సిబ్బంది పర్యవేక్షిస్తారన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా షటిల్‌ సర్వీస్‌ ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. అన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేశామని, దీనివల్ల దొంగతనాలు నిరోధించే వీలుంటుందన్నారు. అదే విధంగా నాలుగు డ్రోన్‌ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

>
మరిన్ని వార్తలు