చినుకు పడితే చెరువే..

18 Jul, 2019 10:42 IST|Sakshi
ఆదెమ్మదిబ్బ ప్రాంతం  

సాక్షి, తూర్పు గోదావరి: చినుకు పడితే చాలు దేశ ఆర్థిక రాజధాని ముంబయి చిగురుటాకులా వణికిపోతుంది. గత పాలకులు, అధికారుల అనాలోచిత చర్యల వల్ల నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ భయం నేడు జిల్లాలో ప్రధాన నగరాలనూ వెంటాడుతోంది. జిల్లా సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో, ‘ప్లాన్డ్‌ సిటీ’, ‘సెకండ్‌ మద్రాస్‌’గా పేరొందిన కాకినాడ నగరాల్లో నేడు ఆ పరిస్థితులే దాపురించాయి. చినుకు పడితే డ్రైనేజీలు పొంగిపోయి ఆ మురుగునీటితో రహదారులు నిండిపోయి ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. గత టీడీపీ పాలనలో ప్రజా ప్రతినిధుల అనాలోచిత నిర్ణయాలు,  ప్రణాళికలు లేని అధికారుల చర్యలు వెరసి ఆయా ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది.

అమృత్‌ పథకం కింద చేపట్టిన భూగర్భ డ్రైనేజీల నిర్మాణం కొన్నిచోట్ల ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టు ఉండగా మరికొన్ని చోట్ల అసంపూర్తి నిర్మాణాలు ఉన్నాయి. ఇక రాజమహేంద్రవరం లో భూగర్భ డ్రైనేజీలు ఉన్నా వాటిని వినియోగంలోకి తీసుకురావడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వర్షాకాలం వచ్చి వెళ్లినప్పుడల్లా వాటిలో పేరుకుపోయిన సిల్ట్‌ తీయడం తప్ప ఆ డ్రైనేజీలు ఎందుకూ వినియోగించడం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చక్కని ప్రణాళికలతో ఈ నగరాల్లో ముంపు సమస్యను పరిష్కరిస్తారని ఆశిద్దాం.

కాకినాడ: పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నచందంగా స్మార్ట్‌సిటీ కాకినాడ తయారైంది. సరైన ప్రణాళిక లేకుండా నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ వల్ల చిన్నపాటి వర్షానికి కూడా కాకినాడ నగరం తీవ్ర ముంపు సమస్యను ఎదుర్కొంటోంది. వర్షపునీటి పారుదలకు సరైన వ్యవస్థ లేకపోవడం ఇందుకు ప్రధాన అవరోధంగా కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలతో పాటు నిత్యం రద్దీగా ఉండే మెయిన్‌రోడ్డు, సినిమారోడ్డు, బాలాజీచెరువు వంటి ముఖ్యప్రాంతాలు కూడా కొద్దిపాటి వర్షం పడినా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైన్లలోని మురుగునీరు పొంగి పొర్లడంతోపాటు వాహనాలు మెకాలిలోతు నీటిలో ప్రయాణించాల్సిన దుస్థితిని నగరవాసులు ఎదుర్కొంటున్నారు. 

17 ముంపు ప్రాంతాలు గుర్తింపు
జిల్లా కేంద్రం కాకినాడలో మెయిన్‌రోడ్డు, సినిమా రోడ్డు, నూకాలమ్మ గుడి, బాలాజీచెరువు, పాత బస్టాండ్, పర్లోపేట, రామకృష్ణారావుపేట, రేచర్లపేట వంటి 17 ప్రాంతాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించారు. ప్రధాన డ్రైన్లకు అనుసంధానం లేకపోవడంతో వర్షపునీటి ప్రవాహం ఆగిపోయి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితిని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్నారు. ఈ స్థితిలో రూ.72 కోట్లతో 54 కిలోమీటర్ల పరిధిలో డ్రైనేజీలను ఆధునీకరించేందుకు స్మార్ట్‌సిటీ, అమృత్, 14వ ఆర్థిక సంఘ నిధుల ద్వారా గతంలోనే ప్రతిపాదనలు చేశారు. అయితే అవి ఏ మాత్రం ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. పట్టుమని నాలుగో వంతు పనులు కూడా పూర్తికాకపోవడంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకని పరిస్థితి నెలకొంది. 
భూగర్భ డ్రైనేజీకి ఇబ్బందే..
భూగర్భ డ్రైనేజీ ద్వారా సమస్య పరిష్కారానికి అవకాశం ఉన్నా జిల్లా కేంద్రానికి మాత్రం ఆచరణ సాధ్యం కాదని ఇప్పటికే తేల్చేసిన పరిస్థితి నెలకొంది. కాకినాడ నగరం సముద్ర మట్టానికి దిగువన ఉండడంతో వర్షపునీరు ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. గతంలో భూగర్భ డ్రైనేజీ కోసం రూ.వెయ్యి కోట్లకు పైగా ఖర్చుకాగలదని అంచనా వేసినా అది ఆచరణ సాధ్యం కాదని తేలడంతో ప్రతిపాదనపై వెనకడుగు వేశారు. వర్షపునీటి ప్రవాహం ముందుకు వెళ్లేలా ఇప్పటికైనా అధికారులు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుంటే ముంపు సమస్యకు చాలా వరకు పరిష్కారం దొరకగలదంటున్నారు.
    

‘అమృత్‌’లో అభివృద్ధికి చర్యలు
అమృత్‌ పథకం ద్వారా స్టార్మ్‌ వాటర్‌ డ్రైనేజీలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సుమారు 54 కిలోమీటర్ల పరిధిలో రూ.72 కోట్ల వ్యయంతో ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనులన్నీ పూర్తయితే కాకినాడ నగరం ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వచ్చే ఏడాది మే లోపుగా ఈ పనులు పూర్తయ్యేందుకు కాలపరిమితి ఉంది. 
–  పీవీ సత్యనారాయణరాజు, ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ

వర్షపు నీటితో అన్నీ ఇబ్బందులే
వర్షం వచ్చిన ప్రతిసారీ ప్రధాన రహదారులు మునిగిపోతున్నాయి. డ్రైనేజీలలోని మురుగునీరు కూడా వర్షపునీటితో కలిసి రోడ్లపైకి వస్తోంది. దీని వల్ల ముంపునకు గురైన రోడ్లపై ప్రయాణం చేయడం చాలా ఇబ్బంది కరంగా ఉంటోంది. మురికినీటితో కూడిన వర్షపునీటి వల్ల ఎలాంటి రోగాలు వస్తాయోనన్న భయం నెలకొంది. దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రణాళిక రూపొందించి నగరానికి ముంపునీటి సమస్యను తీర్చాలి. 
– వి.మనోజ్, నూకాలమ్మగుడి ప్రాంతం, కాకినాడ

వర్షం వస్తే ఇక్కట్లే...
చిన్నపాటి వర్షానికి కూడా నగరంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతోంది. స్మార్ట్‌ సిటీలో వందల కోట్ల వ్యయంతో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నా ముంపు సమస్య పరిష్కారానికి మాత్రం సరైన చర్యలు తీసుకోలేకపోయారు. కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఈ సమస్యపై త్వరలోనే ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతోంది. 
– రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌

మరిన్ని వార్తలు