వైఎస్సార్‌ సీపీ కాకినాడ అధ్యక్షుడిగా రమేష్‌

17 Oct, 2017 15:26 IST|Sakshi

కాకినాడ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడిగా సీనియర్‌ కార్పొరేటర్‌ కంపర రమేష్‌ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం రాత్రి ఈ నియామకాన్ని ప్రకటించింది. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుకైన పాత్ర వహిస్తోన్న రమేష్‌ 1992లో ఎన్‌ఎస్‌యూఐ నగర అధ్యక్షునిగా, 1995లో జిల్లా యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 2000లో కాకినాడ మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికై వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు.

2005లో కార్పొరేటర్‌గా ఎన్నికై స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2013 నుంచి 17 వరకు నాలుగేళ్లపాటు కాకినాడ నగర కాంగ్రెస్‌ అధ్యక్షునిగా పనిచేసి ఇటీవల జరిగిన కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరి 9వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఘన విజయం సాధించారు. కాకినాడ నగర అధ్యక్షునిగా తనను నియమించిన పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి, ఇందుకు సహకరించిన మాజీ మంత్రి, సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, కాకినాడ పార్లమెంట్‌ కో–ఆర్డినేటర్‌ చలమలశెట్టి సునీల్‌ ఇతర నాయకులకు కంపర రమేష్‌ కృతజ్ఞతలు తెలిపారు.

జగన్‌ సీఎం కావడమే లక్ష్యం
వచ్చే ఎన్నికల్లో జగన్‌ ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని కంపర రమేష్‌ పేర్కొన్నారు. నగరాధ్యక్షునిగా నియమితులైన సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పార్టీ ప్రకటించిన నవరత్న పథకాలు, వైఎస్సార్‌ కుటుంబం కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానన్నారు. రమేష్‌కు కుమార్‌ అభినందనలు రమేష్‌ను పార్టీ ప్రస్తుత నగర అధ్యక్షుడు  కుమార్‌ అభినందించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి కాకినాడ నగరాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించిన తనకు అన్ని విధాలా సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు