కాకినాడ ఘటనపై హక్కుల సంఘం నోటీసు

23 Jul, 2014 00:45 IST|Sakshi
కాకినాడ ఘటనపై హక్కుల సంఘం నోటీసు

న్యూఢిల్లీ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గ్రీన్‌ఫీల్డ్స్ అంధుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులను చిత్రహింసలు పెట్టిన సంఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. కాకినాడలో గ్రీన్ ఫీల్డ్ అంధుల పాఠ శాల కరెస్పాండెంట్ కొలకొండ వెంకటేశ్వరరావు ముగ్గురు బాలురను చితక్కొట్టిన విషయం సోమవారం వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీనిపై మీడియాలో వచ్చిన వార్తలను కమిషన్  సుమోటోగా స్వీకరించింది. నాలుగు వారాల్లోగా నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కాకినాడ జిల్లా మేజిస్ట్రేట్‌కు నోటీసులిచ్చింది.

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పాఠశాల నిర్వహణ...

విశాఖపట్నం: గ్రీన్‌ఫీల్డ్స్ అంధుల పాఠశాల కరస్పాం డెంట్ వెంకటేశ్వరరావు, ఆయన భార్య నూర్జహాన్ విశాఖపట్నం సాగర్‌నగర్ ప్రభుత్వ అంధ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూనే ప్రైవేట్  సంస్థ నడుపుతు న్న వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడింది. తాను హృ ద్రోగిననే కారణంతో వెంకటేశ్వరరావు తరచూ సెలవులు పెట్టి కాకినాడ వెళుతుంటారు. అయితే అక్కడ ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్న విషయం గోప్యంగా ఉంచారు. కాకినాడ సంఘటనతో విశాఖలో అంధబాలికల పాఠశాల సిబ్బంది నివ్వెరపోయారు. ఈ సంఘటనపై స్పందించిన రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ డెరైక్టర్ మంగళవారం విశాఖ అంధబాలికల పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఫ్యాక్స్ ద్వారా వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు పంపించారు.  

కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ అరెస్టు...

కాకినాడ: అధికారుల ఫిర్యాదు మేరకు అంధుల పాఠశాల కరస్పాండెంట్ కేవీరావు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరిపై 324 రెడ్‌విత్ 34 ఐపీసీ, సెక్షన్ 23 ఆఫ్ జువైనల్ జస్టిస్ యాక్ట్-2000 ప్రకారం కేసులు నమోదు చేశారు.కాగా, పాఠశాల చైర్మన్‌పై ఫిర్యాదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంధుల పాఠశాల నిర్వహణకు ప్రభుత్వపరంగా అనుమతులు లేవని తెలిసింది.

పోలీసులపై న్యాయమూర్తి మండిపాటు: నిందితులపై పోలీసులు బెయిలబుల్ సెక్షన్ నమోదు చేసి తీసుకురావడంపై నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ డి.రామలింగారెడ్డి మండిపడ్డారు. న్యాయమూర్తి రికార్డును పరిశీలించి స్వయంగా (సుమోటో) 325 రెడ్‌విత్ 34 ఐపీసీ (నాన్‌బెయిలబుల్) కింద సెక్షన్ మార్పు చేసి నిందితులకు రిమాండ్ విధించడంతో కాకినాడ సబ్‌జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థులు తమపై జరిగిన చిత్రహింసల షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు.  వైద్యం చేస్తున్న డాక్టర్లన్నా జడిసి వారికి దూరంగా వెళ్లిపోతున్నారు.
 

మరిన్ని వార్తలు