కూ..చుక్..చెక్

7 Feb, 2014 00:49 IST|Sakshi
సాక్షి ప్రతినిధి, కాకినాడ :కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్, కాకినాడ మెయిన్ రైల్వేలైన్...ఈ రెండు రైల్వే ప్రాజెక్టులూ జిల్లావాసుల చిరకాల వాంఛ. ఏటా ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయన్న  ఎంపీల మాటలు నమ్మి ప్రజలు మోసపోతున్నారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జీఎం పీకే శ్రీవాస్తవ ఆ రెండు రైల్వే ప్రాజెక్టులు పట్టాలెక్కడం ఇక అసాధ్యమని తేల్చిచెప్పేశారు. కాకినాడ-పిఠాపురం మెయిన్ లైన్ తగిన ట్రాఫిక్ లేకపోవడంతో ఉపయోగం లేదని, ోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్ కోసం గోదావరిపై మూడు వంతెనల   నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించినా, ‘తగిన ప్రయాణికులు, సరుకు రవాణా రాబడి, ట్రాఫిక్ ఉండాలి కదా?’ అని చెప్పుకొచ్చారు. ఆయన మాటలను బట్టి ఈ రెండు ప్రాజెక్టుల వల్లా ఆర్థికంగా రైల్వేలకు ప్రయోజనం లేనందున అటకెక్కినట్టేనని తేలిపోయింది. కోనసీమవాసులకు రైలు కూత వినిపిస్తామని జబ్బలు చరిచి, ఆందోళనలంటూ జనాన్ని రోడ్డెక్కించిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఏమంటారో చూడాలి. అలాగే కూతవేటు దూరంలో ఉన్న పిఠాపురం మెయిన్ రైల్వేలైన్‌తో కాకినాడను కలపాలనే ప్రతిపాదనపై ఆశ కూడా జీఎం మాటలతో నీరుగారిపోయింది.
 
 రాజీనామా.. డ్రామా
 ప్రతి రైల్వే బడ్జెట్ ముందు కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్ కోసం రైల్‌రోకోలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలతో అమలాపురం ఎంపీ హర్షకుమార్ ఊదరగొట్టిస్తూ వచ్చారు. గత రైల్వేబడ్జెట్ సమయంలో మరో ముందడుగు వేసిన ఎంపీ ప్రాజెక్టు సాధించకుంటే పదవికి రాజీనామా చేస్తానని కూడా ప్రగల్భాలు పలికారు. తీరా ప్రాజెక్టులు సాధించాల్సి వచ్చేసరికి ఆశించిన ప్రయత్నం చేయలేక చెతులెత్తేశారు. కాకినాడ ఎంపీ ఎంఎం పళ్లంరాజు యూపీఏ-2 ప్రభుత్వంలో కీలక మంత్రిత్వశాఖలు నిర్వహించారు. వాస్తవానికి ఆయన తండ్రి శ్రీరామసంజీవరావు హయాం నుంచి మెయిన్ లైన్‌తో కాకినాడను అనుసంధానిస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. 
 
 కేవలం 18 కిలోమీటర్ల నిడివి కలిగిన రైల్వేలైన్‌ను అనుసంధానించడం పెద్ద విషయం కాదనే పళ్లంరాజు చెబుతూ వచ్చారు. తీరా గత రైల్వే బడ్జెట్‌కు ముందు ప్లేటు ఫిరాయించేసి మెయిన్‌లైన్‌లో కలపాల్సిన అవసరం కనిపించడం లేదన్నారు. పెట్రోకారిడార్‌లో రైల్వేలైన్ వస్తున్నదనే ఉద్దేశంతో అలా అంటున్నారని అంతా అనుకున్నారు. అదే పళ్లంరాజు రెండు రోజుల క్రితం కాకినాడ-ముంబాయి రైలు ప్రారంభించిన సందర్భంలో మెయిన్‌లైన్‌కు నిధులు మంజూరైపోయాయి, పనులు ప్రారంభించమని రైల్వే అధికారులపై ఒత్తిడి తెస్తానంటూ ప్రజలను మరోసారి నమ్మించే ప్రయత్నం చేయబోయారు. తీరా జీఎం శ్రీవాస్తవ గురువారం కాకినాడలో చెప్పిన విషయమే పళ్లంరాజు మాటల్లో నిజం పాలెంతో చెప్పకనే చెబుతోంది. ‘ఆయనెప్పుడూ అంతే.. జరగని పనులు జరిగిపోతాయంటారు. నిధులు విడుదలైపోతున్నాయంటారు’ అని ప్రజలు నిరసిస్తున్నారు.
 
 కోనసీమ మీదుగా నరసాపురానికి తలపెట్టిన రైలు మార్గానికి గో‘దారు’లే ప్రతిబంధకమయ్యాయి. వాటిపై వంతెనల నిర్మాణానికయ్యే బడ్జెట్‌ను సాధించలేక అక్కడి ఎంపీ చేతులెత్తేయడంతో ఆ ప్రాజెక్టు ఇక అటకెక్కినట్టే. వశిష్ట గోదావరిపై సఖినేటిపల్లి-నరసాపురం, వైనతేయపై బోడసకుర్రు-పాశర్లపూడి, గౌతమీపై కోటిపల్లి-ముక్తేశ్వరంల మధ్య రోడ్ కం రైలు వంతెనలు నిర్మించాలి. వీటితో పాటు మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.329 కోట్ల నుంచి రూ.1047 కోట్లకు పెరిగిపోయింది. లోక్‌సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి కృషితో 2000 నవంబరు 16న కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు పునాదిరాయి పడిన తరువాత ఆ స్థాయి సత్తా కలిగి, ప్రాజెక్టులు సాధించాలనే చిత్తశుద్ధి కలిగిన ఎంపీ లేకపోవడంతోనే ప్రాజెక్టు కాగితాలకే పరిమితమైపోయింది. ఎంపీ హర్షకుమార్ కోనసీమ ఎమ్మెల్యేలను సమన్వయం చేసి కేంద్రంపై ఆశించిన స్థాయిలో ఒత్తిడి తీసుకురాలేకపోయారు. ఈ రకంగా రెండు రైల్వే ప్రాజెక్టులను పట్టాలెక్కించడంలో  ఘోరంగా విఫలమైన ప్రజాప్రతినిధుల తీరును ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.
 
 ప్రజాప్రతినిధుల వైఫల్యమే..
 కోటిపల్లి-నరసాపురం రైల్వేలైను సాధించడంలో కోనసీమ ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారు. గత 14 ఏళ్లలో రైల్వే లైను కోసం కొన్ని ఉద్యమాలు జరిగినా వాటి తీవ్రత కేంద్రప్రభుత్వానికి పట్టేలా ఇక్కడి ప్రజాప్రతినిధులు ప్రయత్నించలేకపోయారు. 2000లో కోనసీమలో రైల్వేలైన్ నిర్మించాలని తలపెట్టినప్పుడు ఆ శాఖ సమగ్రంగా సర్వే చేసింది. ఈ ప్రాంతంలో రైల్వేలైన్ అవసరమని, రైల్వే శాఖకు ఆదాయం కూడా బాగానే ఉంటుందని తేల్చింది. ఆ సర్వే నివేదిక ఆధారంగానే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సాక్షాత్తూ అప్పటి రైల్వేమంత్రి మమతా బెనర్జీ, నాటి సీఎం చంద్రబాబు పునాదిరాయి వేశారు. ఇప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల లైన్ నిర్మాణం సాధ్యం కావడం లేదని రైల్వే శాఖ చెబుతుంటే 2000లో జరిగిన సర్వేలు, నివేదికలకు విలువ లేనట్టేనా ?
 - డాక్టర్ ఇ.ఆర్.సుబ్రహ్మణ్యం,
 కోనసీమ రైల్వే సాధనసమితి అధ్యక్షుడు
 
మరిన్ని వార్తలు