ప్రసూతి వార్డుకు ఊరట

30 Oct, 2019 12:10 IST|Sakshi
కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఒకే మంచంపై ఇద్దరు

కాకినాడ ప్రభుత్వాస్పత్రికి ఆర్థిక చేయూత

రూ.20 కోట్లతో ప్రసూతి విభాగం

భవన నిర్మాణాలకు పరిపాలన అనుమతులు  

ఉత్తర్వులు వెలువరించిన ప్రభుత్వం

భవన నిర్మాణ అంచనాలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు

సాక్షి, కాకినాడ: ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి మహర్దశ పట్టింది. ఇన్నాళ్లూ నిధులు లేక నీరసించిన వైద్యశాల ఇక అభివృద్ధి పథం పట్టనుంది. ఈ మేరకు రూ.20 కోట్ల నిధులతో ప్రసూతి విభాగానికి అవసరమైన భవన నిర్మాణాలకు పరిపాలనా అనుమతులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు వెలువరించారు. ప్రసూతి, చిన్న పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన భవనాల నిర్మాణం, సామగ్రి కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భవన నిర్మాణాలకు అవసరమైన ప్రతిపాదనలు, అంచనాలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

గతం అధ్వానం
జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి అత్యధిక శాతం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌ (సామాన్య ప్రభుత్వ ఆస్పత్రి) వస్తుంటారు. విష జ్వరాలతోపాటు మెటర్నటీ (ప్రసూతికి సంబంధించిన) కేసులు ఎక్కువ శాతం ఇక్కడికి వస్తుంటాయి. పూర్తి జాగ్రత్తలు తీసుకోవల్సిన గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని అవలంబించింది. ప్రభుత్వ బోధనాస్పత్రిలో పెరుగుతున్న ఓపీకి అనుగుణంగా వైద్యుల నియామకం జరగలేదు. ముఖ్యంగా గైనిక్‌ వార్డులో పూర్తి స్థాయిలో వైద్యులు లేకపోవడంతో ఉన్నవారిపై పనిభారం పడేది. ఫలితంగా కీలక సమయంలో వైద్యం అందక చిన్నారులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు తలెత్తాయి. ఆస్పత్రిలోని మాతా, శిశు ప్రసూతి విభాగంలో ఆరు యూనిట్ల పరిధిలో 180 పడకలు మాత్రమే ఉన్నాయి. ప్రతి రోజూ చికిత్స కోసం 550 మంది గర్భిణులు ఆస్పత్రికి వస్తుంటారు. రోజుకు 50 ప్రసవాలు అవుతుంటాయి. ఇందులో 20–25 వరకు సిజేరియన్లు చేస్తుంటారు. అవసరమైన బ్లెడ్లు లేకపోవడంతో ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురిని పడుకోపెట్టి వైద్యం చేసిన సందర్భాలు కోకొల్లలుగా నమోదయ్యాయి. కొన్ని సందర్భాల్లో నేలపైనే వైద్యం అందించే దయనీయ స్థితి తలెత్తింది. ఫలితంగా గర్భిణులకు సౌకర్యాలు కరువై చిన్నారులు మృత్యువాత పడిన సంఘటన కూడా లేకపోలేదు.

రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు
ఆస్పత్రిలో ప్రస్తుతం ఆరు యూనిట్ల పరిధిలో 180 మంచాలు మాత్రమే ఉన్నాయి. ఆసుపత్రిలో ప్రతి నిత్యం 380 మంది గర్భిణులుంటున్నారు. పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలంటే మరో 450 మంచాలు అవసరం. ప్రస్తుత నిధులతో భవన నిర్మాణాలు, బెడ్లు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రసూతి సేవలు కొనసాగుతున్న భవనంపై అదనంగా గదులు నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయడంలో తలమునకలవుతున్నారు.

సీఎం మాట.. ఎమ్మెల్యే కృషి
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా అక్కడి ఎన్‌ఆర్‌ఐలతో సమావేశమయ్యారు. ఆ సందర్భంలో ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సీఎం పిలుపు మేరకు కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో చదివి విదేశాల్లో స్థిరపడిన వారు కాకినాడ జీజీహెచ్‌లో మాతా, శిశు విభాగం అభివృద్ధి కోసం రూ.20 కోట్లు వెచ్చించేందుకు ముందుకొచ్చారు. ఇందుకు సంబంధించి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమక్షంలో అమరావతిలో ఎంవోయూపై సంతకాలు చేశారు. కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి సమక్షంలో ప్రక్రియ పూర్తి చేశారు. అప్పటి నుంచి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎన్‌ఆర్‌ఐలను పలకరిస్తూ నిధులు ప్రభుత్వానికి మంజూరు చేయడంలో కీలక భూమిక పోషించారు. అంతేగాక ఎన్‌ఆర్‌ఐలను అందరికీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి అభివృద్ధికి నిధులు వెచ్చించాలని కోరారు. త్వరలో భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

>
మరిన్ని వార్తలు