అవినీతి కళా పోషకులు..!

9 Mar, 2019 09:38 IST|Sakshi
చౌదరి నారాయణమూర్తి, తన కుమారుడు రామ్‌మల్లిక్‌తో కళావెంకటరావు

ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతల దోపిడీ

కొమ్ము కాస్తున్న మంత్రి కళా వెంకటరావు

నీరు–చెట్టు పనుల్లో నాణ్యత నీళ్లపాలు

యథేచ్ఛగా ప్రభుత్వ భూముల ఆక్రమణలు

‘కొవ్వాడ’ భూపరిహారంలో భారీగా నొక్కుడు

కళా కుమారుడికి పరిశ్రమ కోసం చౌకగా ప్రభుత్వ భూమి 

అవినీతి కళలో ఆరితేరారు.. అనుయాయుల దోపిడీకి కొమ్ముకాస్తారు.. పుత్ర ప్రేమతో విలువైన ప్రభుత్వ భూమిని కారుచౌకగా కట్టబెట్టేస్తారు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నీతి కబుర్లు తియ్యతియ్యగా చెబుతారు.. మంత్రి కళా వెంకటరావు నీడలో సాగుతున్న అవకతవకలు అన్నీ ఇన్నీ కావు. నిర్వాసితుల భూ త్యాగాలను సొంతానికి వాడుకుంటారు. నీరు– చెట్టు పథకాన్ని సైతం దోపిడీ చేయగలరు. మంత్రి కొడుకు పరిశ్రమ పెడతానంటే దగ్గరుండి మరీ భూములు ఇప్పించారు. పరిశ్రమ కనిపించలేదు గానీ భూములు మాత్రం స్వాహా అయిపోయాయి.అన్ని సంక్షేమ పథకాలనూ కార్యకర్తలకు ధారాదత్తం చేస్తారు. మంత్రివర్యుల అవినీతి కళాపోషణపై సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌..

శ్రీకాకుళం : భావి తరాల కోసం నిర్వాసితులు భూములు త్యాగం చేస్తే వారికి రావాల్సిన ఫలాలను తినేశారు. నీరు–చెట్టు అని ప్రభుత్వం పథకం ప్రవేశపెడితే పోటీ పడి మరీ దోపిడీ చేశారు. కొవ్వాడ అణుపార్క్‌ పేరు చెప్పి అందిన కాడికి తినేశారు. మంత్రి కొడుకు పరిశ్రమ పెడతానంటే దగ్గరుండి మరీ భూములు ఇప్పించారు. శ్రమ మిగిలింది తప్ప పరిశ్రమ కనిపించలేదు. భూములు మాత్రం స్వాహా అయిపోయాయి. పింఛన్లు, ఇళ్లు వంటి సకల సంక్షేమ పథకాలనూ కార్యకర్తలకు విస్తరి వేసి వడ్డించారు. విద్యుత్‌ శాఖ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు అవినీతి జాడలివి. హోదాకు తగ్గట్టుగానే ఆయన దోపిడీ కూడా సాగుతోంది.

నీరు–చెట్టులో దోపిడీ
ఎచ్చెర్ల నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం మంజూరు చేసిన మట్టి పనులన్నీ సక్రమంగా జరిగి ఉంటే సాగునీటికి సమస్యే ఉండేది కాదు. కానీ పనులు మాత్రం తూతూమంత్రంగానే టీడీపీ నాయకులు చేశారు. ఎక్కడికక్కడ పనులు పంచేసుకుని జేబుల్లో ప్రజాధనం నింపుకొన్నారు.

పని చేసిన వ్యక్తి పేరు: జడ్డు విష్ణుమూర్తి
టీడీపీతో సంబంధం: మంత్రి కళావెంకటరావుకు మేనల్లుడు, పొగిరి మాజీ సర్పంచి, పనుల విలువ : రూ.5 కోట్లు
జి.సిగడాం మండలంలో మదుపాం, నిద్దాం, ఆనందపురం, లావేరు మండలంలో బుడుమూరు, అదపాక, మురపాక, అప్పాపురం తదితర గ్రామాల్లో నీరు–చెట్టు పథకం పనులు చేశారు. కాలువల్లో పూడికతీతలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేశారు. కానీ నాణ్యతా ప్రమాణాలు మాత్రం అరకొరగానే ఉన్నాయి. బినామీ పేర్లుతో నాసిరకంగా పనులు చేసినా బిల్లులు మాత్రం మంజూరైపోయాయి.

పనిచేసిన వ్యక్తి పేరు: ముప్పిడి సురేష్‌
టీడీపీతో సంబంధం: లావేరు మండల పరిషత్‌ ప్రత్యేక ఆహ్వానితుడు, లావేరు మండల పార్టీ అధ్యక్షుడు, పని విలువ : రూ.50 లక్షలు
తాళ్లవలస గ్రామంలోని చెరువుల్లో పూడికతీత పనులు నిర్వహించారు. అదే చెరువులో ఉపాధి హామీ పథకం కింద కూడా మట్టిపనులు చేయడం గమనార్హం. పనుల్లో నాణ్యత చూస్తే నామమాత్రమే.

పనిచేసిన వ్యక్తి పేరు: గొర్లె విజయ్‌కుమార్‌
టీడీపీతో సంబంధం: రణస్థలం ఎంపీపీ పని విలువ : రూ. 70 లక్షలు
మరువాడ, ఎన్‌జీఆర్‌ పురం, నారువ, చిల్లపేటరాజాం ప్రాంతాల్లో చెరువుల పూడిక తీత పనులు చేపట్టారు. నాణ్యత అంతంత మాత్రమే. మరోపక్క ఉపాధి హామీ పనులు కూడా ఈ చెరువుల్లో జరిగాయి.

పనిచేసిన వ్యక్తి పేరు: లంక శ్యామ్‌
టీడీపీతో సంబంధం: రావాడ మాజీ సర్పంచ్‌
పని విలువ: రూ.40 లక్షలు
రావాడ, లంకపేట, ఎర్రవరంల్లో చెరువుల్లో పూడికతీత పనులు నిర్వహించారు. కనీస నాణ్యత పాటించలేదు. తవ్విన మట్టిని రియల్‌ ఎస్టేట్‌ లేఅవుట్లలో కప్పుడు పనుల కోసం తరలించి అమ్ముకున్నారు.

పని చేసిన వ్యక్తి పేరు: డీజీఎం ఆనందరావు
టీడీపీతో ఉన్న అనుబంధం: మాజీ ఎంపీపీ
పనివిలువ : రూ. 30 లక్షలు
జేఆర్‌ పురం, సీతంవలస ప్రాంతాల్లోని చెరువుల్లో పూడిక తీతలు నిర్వహించారు. కనీస నాణ్యత ఈ పనుల్లో కానరావట్లేదు.

పనిచేసిన వ్యక్తి పేరు: ఎం.కనకరాజు
టీడీపీతోఉన్న సంబంధం: మండల జన్మభూమి కమిటీ సభ్యుడు
పనివిలువ : రూ. 50 లక్షలు
తెప్పలవలస, ఎరవరం, చిన్నహేయలపేట గ్రామాల్లో చెరువుల్లో పూడికల తీత, చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టారు. నాణ్యత ప్రమాణాలు కనీ సం లేవు. ఉపాధి హామీ సామాజక తనిఖీల్లో నీరు–చెట్టు పనులు చేసి బిల్లులు పొందాడు.

పని చేసిన వ్యక్తి పేరు: ఎన్‌.ఈశ్వరరావు
టీడీపీతోఉన్న సంబంధం: రాష్ట్ర హౌసింగ్‌ కార్పోరేషన్‌ డైరెక్టర్, రణస్థలం టీడీపీ అధ్యక్షుడు, పని విలువ : రూ.80 లక్షలు
తిరుపతిపాలెం, బంటుపల్లి, కమ్మశిగడాం గ్రామాల్లో చెరువుల్లో పూడికతీత, చెక్‌ డ్యాం పనులు చేపట్టాడు. మట్టిని కాంట్రాక్టు పనులకు వినియోగించుకున్నాడు.

పనిచేసిన వ్యక్తి పేరు: చౌదరి అవినాష్‌
టీడీపీతో సంబంధం: మాజీ సర్పంచ్‌ ఎస్‌ఎం పురం, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ చౌదిరి ధనలక్ష్మి కుమారుడు
పని విలువ: రూ. 30 లక్షలు
ఎస్‌ఎంపురం పెద్దచెరువులో పూడిక తీత, మదుముల నిర్మాణ పనులు చేపట్టారు. ఉపాధి హామీ పథకం పనులు సైతం ఇదే చెరువులో నిర్వహించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. మట్టిని స్థానిక రోడ్డు నిర్మాణంలో బెర్ముగా వినియోగించారు.

పని చేసిన వ్యక్తి పేరు: బల్లాడ వెంకటరమణారెడ్డి
టీడీపీతో సంబంధం: ఎచ్చెర్ల ఎంపీపీ, పని విలువ: రూ. 60 లక్షలు
కుప్పిలిలోని చెరువుల్లో పూడిక తీతలు, చెక్‌ డ్యామ్‌ల నిర్మాణ పనులు చేపట్టారు. కనీస నాణ్యత ప్రమాణాలు పాటించలేదు.

పని చేసిన వ్యక్తి పేరు: బెండు మల్లేశ్‌
టీడీపీతో సంబంధం: ఎచ్చెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు
పనివిలువ: రూ.32 లక్షలు
ఊటగడ్డలో పూడికల తీత పని చేశారు. కానీ ప్రస్తుతం కాలువ పరిస్థితి దయనీయంగా ఉంది.

కళా కుమారుడి పరిశ్రమ ఏది?
మంత్రి కళా కుమారుడు రామ్‌మల్లిక్‌నాయుడికి రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ ఏర్పాటు కోసం 2015 సెప్టెంబరు నెలలో నారువ గ్రామం వద్ద 9.96 ఎకరాలు కేటా యించింది. సప్తగిరి పవర్‌ ప్రాజెక్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఈ కేటాయింపులు జరిగాయి. కేవలం ఎకరాకు రూ. 4.30 లక్షల చొప్పున కారుచౌకగానే ఈ భూమి దక్కింది. ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.కోట్లలో ఉంది. కానీ ఇప్పటివరకూ అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయలేదు.   

యథేచ్ఛగా ఇసుక దోపిడీ
ఎచ్చెర్ల నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల అండదండలతో నాగావళి నది నుంచి యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగుతోంది. తమ్మినాయుడుపేట, పొన్నాడ, ముద్దాడ పేట ఇసుక రీచ్‌ల నుంచి రోజూ వందల లారీల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. అలాగే బుడుమూరు గెడ్డలోనూ ఇసుక తవ్వేస్తున్నారు. ఉదయం పూట ట్రాక్టర్లతో ఇసుక తెచ్చి చిలకపాలెం, అల్లినగరం సమీపంలో పెద్దపెద్ద పోగులు వేస్తున్నారు. రాత్రిపూట లారీలకు లోడు చేసి విశాఖపట్నం తరలిస్తున్నారు.

అక్రమంగా ఉద్యోగ నియామకాలు
కళా రాష్ట్ర విద్యుత్‌ శాఖా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టింది మొదలు రణస్థలం, లావేరు, జి.సిగడాం, ఎచ్చెర్ల, రాజాం, సంతకవిటి, రేగిడి అమదాలవలస మండలాల్లో ఉన్న విద్యుత్తు సబ్‌స్టేషన్లలో షిఫ్ట్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలను భారీ సంఖ్యలో భర్తీ చేశారు. ఇందుకోసం నిరుద్యోగుల వద్ద నుంచి పోస్టుకు రూ.4 లక్షల వరకూ దళారులు దండుకున్నారు. రేషన్‌ డీలర్లు, అంగన్‌వాడీ వర్కర్ల నియామకంలో సైతం ఇదే తరహా దోపిడీ కొనసాగినా ఉన్నతాధికారులు మిన్నకుండిపోయారు.

ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు....
జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి కుమారుడు స్థానిక సర్పంచ్‌ అవినాష్‌ ప్రభుత్వ భూములపై కన్నేశాడు. ఎస్‌ఎం పురం కొండ 112 సర్వే నంబర్‌లో 20 ఎకరాల వరకు తుప్పలు తొలగించారు. అసలు విషయం ఏమిటంటే మరో సర్వే నంబరులో 4.35 ఎకరాలకు పట్టాదారు అడంగల్‌ చౌదరి సరస్వతమ్మపేరు మీద ఉంది. ఈమె భర్త స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే చౌదరి సత్యనారాయణ. టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి(బాబ్జి) తల్లికి పట్టా ఎప్పుడు ఇచ్చారన్న సమాచారం పట్టాలో లేదు. 15 ఏళ్ల కిందట పట్టా ఉన్నట్లు వీరు చెబుతున్నారు. అక్రమ పట్టాతో భూములు స్వాధీనం చేసుకుంటున్నారు.

అణు భూబకాసురులు
కొవ్వాడ వద్ద అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు 2,438 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. 2016 సంవత్సరంలో చేపట్టిన సమగ్ర సర్వేలో సర్వే సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది 1,473 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రభుత్వ భూమి ఎక్కువ శాతం ఖాళీగాను, కొంత శాతం అక్రమణలోను ఉండేది. కానీ ఈ సర్వే మూలంగా రెవెన్యూ యంత్రాంగం వైఫల్యం వల్ల ప్రభుత్వ భూమి పూర్తిగా ఆక్రమణల్లోకి వెళ్లిపోయింది. ఇదే అదునుగా కొంతమంది వారి స్వార్ధానికై గెడ్డలు, వాగులు, రాస్తాలు కూడా ఆక్రమణ భూమి కింద నమోదు చేయించుకున్నారు. అందులో భాగంగానే రణస్థలం మండల తెలుగుదేశం పార్టీ ఎంపీపీ గొర్లె విజయ్‌కుమార్‌ తమ అనుచరులు, నమ్మకస్తుల పేరున, ఇంటిలో పనివాళ్లు, కోళ్లఫారంలో పనిచేసిన కూలీల పేరున ప్రభుత్వ భూమిని ఆక్రమణ భూమి కింద రెవెన్యూ జాబితాలో నమోదు చేయించుకున్నారు. జీరుకొవ్వాడ, గూడెం రెవెన్యూ పరిధిలో 67 సర్వే నంబర్‌లో రణస్థలం టీడీపీ ఎంపీపీ గొర్లె విజయకుమార్‌ కుటుంబసభ్యుల పేరుతో సర్వే నంబర్లు 67/4, 5, 6, 7, 8, 9, 10లో సుమారు 19.23 ఎకరాలు డీపట్టాలు కలిగియున్నారు. ఆక్రమణ భూములను భూసర్వేలో తమ ఆక్రమణగా నమోదు చేయించుకున్న వివరాలు ఇలా ఉన్నాయి.

గొర్లె మౌనిక (కూతురు)కు 2 ఎకరాలు, దాసరి వెంకటరమణి (సోదరి)కి ఎకరం, గొర్లె సుధాకర్‌ (సోదరుడు)కు 3 ఎకరాలు, గొర్లె ధనలక్ష్మి (భార్య)కి 3 ఎకరాలు, గొర్లె వెంకటసీతారత్నం (వదిన)కు 3 ఎకరాలు, గొర్లె వెంకట దివాకర్‌ నాయుడు (కొడుకు)కు 3 ఎకరాలు, గొర్లె విజయకుమార్‌కు 3.50 ఎకరాలు, బోదేపు భారతి(సోదరి)కి 3.50 ఎకరాల భూమి ఉంది. అలాగే గూడెం రెవెన్యూలో సర్వే నంబర్లు 43–81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97లలో మొత్తం 32.83 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణ భూములుగా నమోదు చేయించుకున్నారు. కుటుంబసభ్యులతో పాటు తమ వద్ద పనిచేసిన రైతులు, ఇతర మండలాలకు చెందిన కుటుంబ సభ్యుల పేరున కూడా అణు భూ సర్వే జాబితాలో భూమిని నమోదు చేయించుకున్నారు. మజ్జి విమల (మరదలు), మజ్జి లక్ష్మణరావు (తోడల్లుడు)లది ఎచ్చెర్ల మండలంలోని కొయ్యాం గ్రామం, అలాగే  నడిమింటి రాంబాబు (తోడల్లుడి కొడుకు)ది లావేరు మండలంలోని అదపాక. అలాగే ఈ భూములే కాకుండా ఎస్సీ కులానికి చెందిన కుటుంబాల పేరున 40 ఎకరాలు అణు భూ సర్వే జాబితాలో నమోదు చేయించుకున్నారు. వీరికి ఎకరాకు రూ.10 వేలు చొప్పున ఇవ్వటానికి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అలాగే పాతర్లపల్లి రెవెన్యూ పరిధిలో తెలుగుదేశం నాయకులు చక్కపెడుతుంటే, కొవ్వాడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిపై వచ్చే పరిహారాన్ని నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు గుట్టుచప్పుడు కాకుండా గుటుక్కు మనిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, ప్రస్తుత టీడీపీ నాయకుడు గొర్లె లక్ష్మణరావు సుమారు 32 ఎకరాల భూమికి బినామీల పేర్లుతో ఇప్పటికే పరిహారం పొందారు. అలాగే టీడీపీ నాయకులు సుంకరి ధనుంజయ, మైలపల్లి వెంకటేష్‌ కూడా తమ అనుచరులు, బంధువుల పేరున ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని కొంతమేర పరిహారం కూడా అందుకున్నారు. వీఎన్‌.పురం, యర్రవరం పంచాయతీల్లో కలిశెట్టి సహదేవుడు, కలిశెట్టి అప్పలనాయుడు ప్రభుత్వ భూములను సుమారు 6 ఎకరాలకు పైగా ఆక్రమించుకున్నారు.

మరిన్ని వార్తలు