కళ తప్పిన మంత్రి!

24 May, 2019 14:46 IST|Sakshi

ఘోర పరాజయం పాలైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

గొర్లె కిరణ్‌ చేతిలో 18813 ఓట్ల తేడాతో చిత్తు

సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట రావు ఘోర ఓటమి చవిచూశారు. వైఎస్సా ర్‌సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌ చేతిలో 18813 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీయేతర పార్టీలు మూడుసార్లు మాత్రమే ఇక్కడ విజయం సాధించా యి. 2004, 2009ల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా, తాజాగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనంలో గొర్లె కిరణ్‌కుమార్‌ విజయం సాధించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు కళా వెంకటరావు పోటీ చేయగా రెండు సార్లు ఓటమి చెందారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీచేసిన ఆయన మూడో స్థానంలో నిలిచారు.

2014లో టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2014లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌పై 4741 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అప్పటి నుంచి కిరణ్‌కుమార్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్తగా నిరంతరం ప్రజల్లో  ఉన్నారు. గ్రామస్థాయిలో పార్టీ క్యాడర్‌ను టీడీపీ నాయకత్వం ప్రలోభాలకు గురిచేసి పార్టీలో చేర్చుకున్నా కొత్త క్యాడర్‌ తయారు చేస్తూ ముందుకుసాగారు. నిరంతరం ప్రజల్లో ఉండటం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, జన్మభూమి కమిటీల వైఫల్యాలను జనంలోకి తీసుకువెళ్లటం, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయడం విజయానికి దోహదపడ్డాయి. మరోవైపు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర ఎచ్చెర్ల నియోజకవర్గంలో నిర్వహించటం, పార్టీ నవరత్నాలు పథకాల సాయంతో కళావెంకటరావును ఓడించగలిగారు.

మరిన్ని వార్తలు