కాళోజి అంటేనే తెలంగాణ సమాజం

20 Nov, 2013 04:57 IST|Sakshi

 డిచ్‌పల్లి, న్యూస్‌లైన్: మనిషిని మనిషిగా గుర్తించే సమాజం ఏర్పడాలని ప్రముఖ ప్రజాకవి కాళోజి నారాయణరావు అనుక్షణం కోరుకున్నారని తెలంగాణ జేఏసీచైర్మన్ ఎం.కోదండరాం అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యాయన శాఖ, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్వంలో ‘కాళోజి శతజయంతి సంబరాలు-ప్రస్థానం-సాహిత్య పరిమళం’ అనే అంశంపై మంగళవారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. కాళోజి గురించి మాట్లాడటమంటే యావత్ తెలంగాణ సమాజం గురించి మాట్లాడటమేనని అభిప్రాయపడ్డారు. మానవతా విలువలు, వ్యక్తి శ్రేయోవాదంతో కూడిన కాళోజి ఆలోచనలు, కవిత్వం తెలంగాణ ఉద్యమాన్ని విపరీతంగా ప్రభావితం చేశాయన్నారు. ఆయన బాల్యం నుంచే తిరుగుబాటును ప్రకటించారన్నారు. పోరాట ప్రవృత్తిలో గాంధేయ విధానాలు ఆయనను ప్రభావితం చేశాయని విశ్లేషించారు. ఆధిపత్య భావనలపై తిరుగుబాటు చేసే విషయంలో ప్రహ్లాద పాత్రను కాళోజీ ఆదర్శవంతంగా తీసుకున్నారన్నారు.
 
 ఆనాటి మరాఠీ, బ్రిటిషు పాలిత ప్రాంతాలలో జరిగిన జాతీయోద్యమం కాళోజీని బాగా ప్రభావితం చేసిందన్నారు. ఆయన జీవితంలోని వివిధ సంఘటనలను ఆయన ఆసక్తికరంగా వివరించారు. అనంతరం కోదండరాంను తెయూ తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అకాడమీ మాజీ డెరైక్టర్ డాక్టర్ వెలిచాల కొండల్‌రావు, ఓయూ తెలుగు విభాగాధిపతి డాక్టర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ కోవెల సుప్రసన్నాచార్య, మానవ హక్కుల ఉద్యమకర్త జీవన్‌రావు, తెయూ రిజిస్ట్రార్ లింబాద్రి, ప్రిన్సిపాల్ ధర్మరాజు, మాజీ రిజిస్ట్రార్‌లు శివశంకర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు