దుర్గమ్మ భక్తులపై భారం

17 May, 2018 13:08 IST|Sakshi
మాడపాటి గెస్టెహౌస్‌లో పాలకమండలి సమావేశంలో పాల్గొన చైర్మన్‌ యలమంచిలి గౌరంగ బాబు, ఆలయ ఈవో ఎం.పద్మ, సభ్యులు

శాంతి కల్యాణోత్సవం టికెట్‌ ధర రూ.1000కు పెంపు

రూ.13.70 కోట్లతో జీ+4 కాటేజ్‌లు

భక్తులకు ఉచిత ప్రసాదాల పంపిణీ

140 ఎకరాల అమ్మవారి భూములు వేలం

ట్రస్టుబోర్డు సమావేశంలో నిర్ణయం

సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై టీడీపీ పాలకమండలి  వచ్చిన తరువాత భక్తులకు సౌకర్యాలకు కల్పించడం కంటే భారాలు మోపేందుకే ఆసక్తి చూపుతుంది. గతంలో లడ్డూ, ప్రసాదాలు, కార్లు పార్కింగ్, కొన్ని పూజల ధరలు పెంచిన పాలకమండలి తాజాగా శాంతి కల్యాణం టికెట్‌ ధరలను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బుధవారం మాడపాటి గెస్ట్‌హౌస్‌లో చైర్మన్‌ యలమంచిలి గౌరంగబాబు, ఈవో ఎం.పద్మల ఆధ్వర్యంలో పాలకమండలి సమావేశం జరిగింది. అనంతరం చైర్మన్, ఈవో సమావేశ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈవో, చైర్మన్‌ మాట్లాడుతూ శాంతి కల్యాణం టికెట్‌ ధర రూ.500 నుంచి రూ.1000కు పెంచామని చెప్పారు. గతంలో శాంతి కల్యాణం చేయించుకున్న భక్తులకు రూ.100 టికెట్‌ లైన్‌లో దర్శనానికి అనుమించేవాళ్లమని ఇప్పు డు అంతరాలయ దర్శనానికి(రూ.300 టికెట్‌)  అనుమతిస్తామన్నారు.

రూ.13.70 కోట్లతో జీ+4 కాటేజ్‌లు
గొల్లపూడిలో దేవస్థానానికి చెందిన స్థలంలో జీ+4 కాటేజ్‌లను రూ.13.70 కోట్లతో నిర్మించాలని నిర్ణయించారు. అయితేఈ నిధులు భక్తుల నుంచి సేకరిస్తారు. రూ.10 లక్షలు చెల్లించిన దాత పేరును ఒక గదికి, రూ.15 లక్షలు ఇచ్చిన దాత పేరు ఒక సూట్‌కు పెడతారు. దాతలకు ఏడాదికి 30 రోజులు ఈ రూమ్‌ లేదా కాటేజ్‌ను ఉచితంగా వాడుకోవచ్చని, మిగిలిన రోజుల్లో భక్తులకు అద్దెలకు ఇస్తామని చెప్పారు.

భక్తులకు ఉచిత ప్రసాదాలు
ఇంద్రకీలాద్రిపై ఉన్న ఉపాలయాలైన నటరాజస్వామి, సుబ్రహ్మణేశ్వరస్వామి వార్ల దేవాలయాలకు వచ్చే భక్తులకు కూడా ఇక నుంచి ఉచితంగా ప్రసాదాలు పంపిణీ చేయాలని పాలకమండలి నిర్ణయించింది. ఇప్పటికే అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఉచిత ప్రసాదం అందజేస్తున్నారు. ఇక నుంచి ఉపాలయాలు వద్ద కూడా ఉచిత ప్రసాదాల పంపిణీ జరుగుతుంది.

ఇంద్రకీలాద్రిపై శ్రీ పాశుపతాస్త్రాలయం
ఇంద్రకీలాద్రిపై పాశుపతాస్త్రాలయం పునః నిర్మించేందుకు ఎ.శివనాగిరెడి(స్థపతి) కన్సల్‌టెంట్‌గా నియమించేందుకు పాలకమండలి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

రూ.58లక్షలతో గ్రీనరీ అంశం వాయిదా
ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ గ్రీనరీ అండ్‌ బ్యూటిఫికేషన్‌  కార్పొరేషన్‌ ఇంద్రకీలాద్రిపై గ్రీనరీ అభివృద్ధికి రూ.58 అంచనాలతో తయారు చేసిన ప్రతిపాదనను వాయిదా వేశారు. గ్రీనరీని దేవస్థానం సిబ్బందే చేయాలని సూచించింది.

క్షురకులకు మాస్క్‌లు
దేవస్థానంలోని కేశఖండన శాలలో పనిచేసే క్షురకులు గ్లౌజ్‌లు, మాస్కులు ధరించాలనే ప్రతిపాదనకు పాలకమండలి ఆమోదముద్ర వేసింది. క్షురకులు అనారోగ్యంతో చనిపోయినప్పడు, అతడి భార్యకు లేదా వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి మాత్రమే కేశఖండన శాఖ వద్ద పనిచేయడానికి అనుమతి ఇచ్చే ప్రతిపాదనను తమ పరిధిలోకి రాదని పాలక మండలి సభ్యులు అభిప్రాయపడ్డారు.

ఉపాలయాల్లో నగల అలంకరణ
అమ్మవారికి భక్తులు సమర్పించే బం గారాన్ని భద్రపరిచి అమ్మవారికి ఏడువారాల నగలు, ఉపాలయాల్లోని దేవతామూర్తులకు వెండి, బంగారు ఆభరణాలు తయారు చేయించాలని నిర్ణయించారు. వెండి విక్రయించగా వచ్చిన సొమ్ము బంగారం, బాండ్లుగా మార్చాలని నిర్ణయించారు.

140 ఎకరాలభూములు వేలం
శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, దాని దత్తత దేవాలయాలకు సుమారు 140 ఎకరాల భూములు ఉన్నాయి. వీటి లీజు పరిమితి ముగియడంతో తిరిగి వేలం నిర్వహించి మూడేళ్ల కాలపరిమితికి లీజుకు ఇచ్చేందుకు దేవస్థానం అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 21 నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకు ఒకొక్క రోజు ఒక్కో దేవాలయానికి చెందిన భూముల లీజు హక్కు కోసం వేలం నిర్వహించాలని నిర్ణయించారు. వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చని ఈవో ఎం.పద్మ తెలిపారు. దేవస్థానం ఆస్తులను జాగ్రత్తగా కాపాడి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. నగరం సమీపంలో దేవస్థానానికి చెందిన ఏడు ఎకరాల భూమిలో చైతన్య విద్యాసంస్థల మురుగు వదులుతున్న విషయాన్ని పరిశీలించి ఆ సంస్థకు నోటీసులు ఇచ్చామని, ఒకటి రెండు రోజుల్లో మురుగు రాకుండా పకడ్బందీగా ఏర్పాటుచేసి ఆ భూమిని కాపాడతామని చెప్పారు. ప్రస్తుతం ఆ భూమికి వేలం నిర్వహించడం లేదని ఈవో తెలిపారు.

మరిన్ని వార్తలు