హోదా సంజీవని కాదన్నారుగా!

16 Apr, 2018 01:37 IST|Sakshi

సీఎంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు లేఖ

సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా సంజీవని కాదని గతంలో తేల్చిచెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలకోసం మాట మారుస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఇప్పుడు యూటర్న్‌ తీసుకొని ప్రత్యేక హోదా కావాలని అడగడం ఏమిటని ప్రశ్నించారు.

2019లోనూ నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానమంత్రి కావాలంటూ ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టారని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం బహిరంగ లేఖ రాస్తు న్నానంటూ టీడీపీకి, సీఎం చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆదివారం విజయవాడలో బహిరంగలేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు.

ఆ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు అందజేసే అదనపు సాయాన్ని లెక్కగట్టి మన రాష్ట్రానికి రూ.16 వేల కోట్ల నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ విమర్శలకు భయపడి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జంకుతోందని ఎద్దేవా చేశారు. గతేడాది కంటే ఈ ఏడాది కేంద్రం నుంచి 82 శాతం అధికంగా నిధులొచ్చాయని ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించారని తెలిపారు.

విదేశాల్లో ప్రధానిపై విమర్శలా?  
‘‘చంద్రబాబు సింగపూర్‌లో పర్యటిస్తూ ప్రధా ని మోదీపై విమర్శలు చేయడాన్ని మేము(బీజేపీ) తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రధాని దీక్ష చేయడాన్ని సీఎం తప్పుపట్టారు. మరి ఈనెల 20న సీఎం హోదాలో దీక్ష చేయాలన్న నిర్ణయానికి ఆయన ప్రజలకు ఏం జవాబు చెబుతారు’’అని హరిబాబు ప్రశ్నించారు.  

హామీలు 85 శాతం అమలు  
‘‘వివిధ విద్యాసంస్థలకు కేంద్రప్రభుత్వం నిధులిచ్చినా వాటికి అవసరమైన భూములు రాష్ట్రప్రభుత్వం ఇవ్వకపోతే భవనాలను ఆకాశంలో కడతారా? కేంద్రం మూడున్నరేళ్లలో హామీలను 85 శాతం అమలు చేసింది. ’’అని చెప్పారు.

మరిన్ని వార్తలు