అందులో మా తప్పేం లేదు: కామినేని

26 Nov, 2017 15:55 IST|Sakshi

సాక్షి, విజయవాడ : గత 28 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో కడప ఫాతిమా మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు, ఒక విద్యార్థి తండ్రి గుణదలలోని సెల్ టవర్ ఎక్కడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఆందోళన నేపథ్యంలో ఏపీ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న స్టూడెంట్స్ కు గవర్నమెంట్ కళాశాలలో సీట్లు ఇవ్వడానికి అభ్యంతరం తెలిపిందన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్ధనను సుప్రీంకోర్టు కొట్టివేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఫాతిమా విద్యార్ధుల విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ లెటర్ రాసినట్లు తెలిపారు. ఫాతిమా కళాశాల విద్యార్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు కాని, ప్రమేయం గాని లేదని.. కాలేజీ యాజమాన్యమే తప్పు చేసిందని మంత్రి కామినేని ఆరోపించారు.

ఫాతిమా విద్యార్ధుల సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి జె.పి.నడ్డాతో, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసుధాన్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు మంత్రి కామినేని శ్రీనివాస్ ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం.  ఫాతిమా మెడికల్ కళాశాల సమస్యలపై ఈ నెల 29,30న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. విద్యార్ధుల అభ్యర్ధన మేరకే వారి సమస్యలపై విద్యార్ధుల ముందే ఫాతిమా కళాశాల యాజమాన్యంతో మాట్లాడాం తప్ప, అంతకు మించి యాజమాన్యంతో ఇతర విషయాలు చర్చించలేదని మంత్రి కామినేని చెబుతున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలపై తమకు నమ్మకం పోయిందని బాధిత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల ఉపఎన్నిక సమయంలో సీఎం చంద్రబాబు తమకు వేరే కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. ఈ నేపథ్యంలో ఐదుగురు విద్యార్థులు, ఒక విద్యార్థి తండ్రి తమకు న్యాయం చేయాలని కోరుతూ గుణదలలో సెల్ టవర్ ఎక్కారు.

మరిన్ని వార్తలు