నేనా...హీరోయిన్ను ఏడిపించానా?

11 Apr, 2015 13:24 IST|Sakshi
నేనా...హీరోయిన్ను ఏడిపించానా?

ప్రముఖ సినీనటి శ్రుతి హాసన్ను ఏడిపించినట్లు సామాజిక అనుసంధాన వేదిక (సోషల్ మీడియా)లో హల్చల్ చేసిన వార్తలను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శనివారం ఖండించారు. తాను శ్రుతి హాసన్ను సినిమాల్లో తప్ప నిజ జీవితంలో ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదన్నారు. అలాంటిది తాను శ్రుతి హాసన్ను ఎలా ఏడిపిస్తానని  కామినేని ప్రశ్నించారు. తిరుపతికి తాను ఎప్పుడు వెళ్లిన కారులో వెళ్లి వస్తానని చెప్పారు.

ఒక్కసారి మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి తిరుపతి నుంచి విమానంలో వచ్చానన్నారు. ఏదో వార్త రావడం ఆ విషయం సామాజిక అనుసంధాన వేదికలో హల్చల్ చేయడం..దీనిపై మీడియాలో కథనాలు వెలువడటం.. కనీసం వివరణ కూడా తీసుకోకుండా ప్రసారం చేస్తున్నారని మంత్రి కామినేని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

 

 వివరాల్లోకి వెళితే ....శుక్రవారం శ్రుతి హాసన్, మంత్రి కామినేని శ్రీనివాస్ ఒకే విమానంలో పక్కపక్క సీట్లలో కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. ఆ క్రమంలో మంత్రిగారు గట్టిగా ఫోన్లో మాట్లాడుతుండగా... నిదానంగా మాట్లాడుకోండి అంటూశ్రుతి హాసన్ సదరు మంత్రిగారికి సలహా ఇచ్చింది.  దాంతో మంత్రిగారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మేము ప్రజా ప్రతినిధులం పైగా మంత్రి వర్యులం... గట్టిగానే మాట్లాడతాం అని మంత్రి కోపంతో బదులు ఇచ్చారు. దీంతో  శ్రుతి హాసన్ కన్నీటి పర్యంతమైయ్యారు.  ఇది ప్రస్తుతం సామాజిక అనుసంధాన వేదికలో హల్చల్ చేస్తున్న కథనం.  అంతేకాకుండా పలు ఛానల్స్ కూడా ఈ వార్తను ప్రసారం చేశాయి. దాంతో ఆ కథనాలపై శనివారం మంత్రి కామినేని శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. అవన్నీ కట్టుకథలేనని ఆయన కొట్టిపారేశారు.

మరిన్ని వార్తలు