డిసెంబర్‌ 31కి కనకదుర్గ ఫ్లైఓవర్‌ పూర్తి

17 Jun, 2019 04:35 IST|Sakshi
ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మంత్రులు ధర్మాన, వెలంపల్లి, ఎమ్మెల్యే మల్లాది

నూతన సంవత్సర కానుకగా అందుబాటులోకి..

రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ వెల్లడి

పనులు చేసే క్రమంలో నెల రోజులపాటు ట్రాఫిక్‌ నిలిపివేత

ప్రజలు సహకరించాలి: దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి

విజయవాడలో అధికారులతో కలసి పనుల పరిశీలన

భవానీపురం (విజయవాడ పశ్చిమ): డిసెంబర్‌ 31 నాటికి విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్‌ నిర్మాణం పూర్తి చేసి నూతన సంవత్సర కానుకగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. ఈ మేరకు కాంట్రాక్టు సంస్థకు ఆదేశాలిచ్చామన్నారు. ఆదివారం ఆయన దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఉన్నతాధికారులతో కలసి విజయవాడలో పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ– హైదరాబాద్‌ మార్గంలో ప్రయాణించే ప్రజలకు కనకదుర్గ ఫ్‌లై ఓవర్‌ అత్యంత ప్రాముఖ్యమైనదన్నారు. అందుకే తొలి ప్రాధాన్యతగా ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారని చెప్పారు.

మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఫ్లై ఓవర్‌ నిర్మాణం పూర్తి చేసే క్రమంలో నెల రోజులపాటు కింద రోడ్డు మార్గంలో కొన్ని చోట్ల ట్రాఫిక్‌ను నిలిపేయాల్సి వస్తుందని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో ఐదేళ్లకు కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ.. ఫ్‌లైఓవర్‌ నిర్మాణం నిమిత్తం కేంద్ర ప్రభుత్వం (నేషనల్‌ హైవేస్‌) నుంచి ఇప్పటి వరకు రూ. 233 కోట్లు విడుదలయ్యాయని, మరో రూ. 100 కోట్లు రావల్సి ఉందన్నారు.

భూ సేకరణ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 114 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఫ్‌లైఓవర్‌కు వయాడక్ట్‌ వంటి అదనపు పనులు చేయటం వలన రూ. 25 కోట్ల మేర అదనపు భారం పడిందని తెలిపారు. ఇప్పటికి దాదాపు 85 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ జాన్‌ మోషే, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ రాజీవ్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వ రీజనల్‌ రవాణా అధికారి ఎస్‌కే సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు