కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ

29 Jun, 2014 03:19 IST|Sakshi

అనకాపల్లి టౌన్: సత్యనారాయణపురం పంచాయతీలో గల కనకదుర్గమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఈ చోరీలో సుమారు నాలుగు తులాల బంగారం, పది తులాల వెండి ఆభరణాలను అపహరించారు. వివరాలివీ. శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో ఎప్పటి మాదిరిలా ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి గుడి ద్వారాలు మూసివేసి వెళ్లిపోయారు.

తిరిగి శనివారం ఉదయం 6.00 గంటలకు పూజలు నిర్వహించేందుకు వచ్చిన ఆలయ అర్చకుడు ఆలయానికి పక్కన ఉన్న ద్వారం తెరిచి ఉండడాన్ని గమనించారు. అలాగే అమ్మవారి గర్భగుడి ద్వారం కూడా తెరిచి ఉండడాన్ని గమనించి వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు తెలియజేశారు. వారు అమ్మవారి ఆలయాన్ని పరిశీలించగా అమ్మవారి విగ్రహానికి ఉన్న బంగారు కనుబొమ్మలు, నేత్రాలు, ముక్కుపుడక, బొట్టు, మంగళసూత్రాలు తదితర ఆభరణాలను అపహరించినట్టు గుర్తించారు.


 అలాగే పక్కనే ఉన్న చిన్న విగ్రహాలకు ఉన్న సుమారు పది తులాల వెండి ఆభరణాలను కూడా అపహరించినట్టు ఆలయ అర్చకుడు వేజేటి ధర్మాచార్యులు, ఆలయ వ్యవస్థాపక కార్యదర్శి బోయిన నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ చంద్ర, క్లూస్ టీమ్ వచ్చి ఆలయ పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చంద్ర తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు