తెరపై పాత్రలు కనుల ముందు..

1 Oct, 2018 08:26 IST|Sakshi
కేరాఫ్‌ కంచరపాలెం చిత్ర నటులను సన్మానిస్తున్న గణబాబు

నరసింహ థియేటర్‌లో ‘కేరాఫ్‌ కంచరపాలెం’ సందడి

గోపాలపట్నం(విశాఖ పశ్చిమం): ఆదివారం ఉదయం.. గోపాలపట్నంలో నరసింహ థియేటర్‌.. కేరాఫ్‌ కంచరపాలెం సినిమా మార్నింగ్‌ షో ప్రదర్శితమవుతోంది. ఉదయం 9.45 గంటలకు యథావిధిగా షో మొదలైంది. ప్రేక్షకులంతా సినిమాలో లీనమయ్యారు. ఇంట ర్వెల్‌ సమయమయ్యే సరికి ప్రేక్షకులు బయటకు వెళ్లేందుకు లేస్తుండగా.. వారి మధ్యనుంచి వెళ్లిన కొందరు తెర ఎదుట కనిపించారు.వారిని గుర్తిం చిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అందరూ కేరాఫ్‌ కంచరపాలెం చిత్రంలోని నటీనటులే. గప్‌చుప్‌గా ప్రేక్షకులతో పాటే ఇంటర్వెల్‌ వరకు వీక్షించిన వీరంతా విరామ సమయంలో సర్‌ప్రై జ్‌ ఇచ్చారు. అప్పటివరకు సినిమాలో చూసిన నటీనటులు ఒక్కసారిగా కనులముందు కనిపిం చేసరికి థియేటర్‌ అంతా ఈలలు, కేకలతో దద్దరిల్లింది.

వారిలో పాత్రధారి రాజు ప్రేక్షకుల కోరికపై ఒక సన్నివేశాన్ని నటించి అలరించారు. రాజు పాత్రధారి(డి. సుబ్బారావు), హీరోయిన్‌ రాధ, అమ్మోరు పాత్రధారి ఉమామహేశ్వరరా వు, ఇతర నటీనటులు కిశోర్, సూరిశెట్టి మధు, అప్పారావు, రమణ,  శైలజ , సురేష్, రోష్ని, మానుషి, బాలనటులు కేశవ, నిత్య, లిఖిత, జశ్వంత్‌లను ఇక్కడి వేడుకలో ప్రభుత్వ విప్‌ గణ బాబు ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ స్థానికులే నటీనటులుగా రూపొందిన ఈ చిత్రం సహజత్వానికి దగ్గరగా ఉండడంతో పాటు సందేశాత్మకంగా ఉందన్నారు. కంచరపాలెం లో భాష, కట్టుబాట్లు, జీవనవిధానం ఈ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించాయన్నారు. ఈ చిత్రంలో నటీనటులకు మరిన్ని సినిమా అవకాశాలు రావాలని ఆకాంక్షించారు. థియేటర్‌ నిర్వాహకుడు కేవీ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు