కందుకూరు చూపు.. మానుగుంట వైపు...

24 Mar, 2019 09:49 IST|Sakshi
దివి కొండయ్యచౌదరి, దివి శివరాం, పోతుల రామారావు, మానుగుంట ఆదినారాయణరెడ్డి, మానుగుంట మహీధర్‌రెడ్డి (మధ్యలో)

సాక్షి, కందుకూరు: ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కందుకూరు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ రెండు కుటుంబాల చుట్టూనే రాజకీయం నడుస్తోంది. అయితే, 2014లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి పోటీచేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అప్పటి వరకు కొనసాగుతున్న కుటుంబ రాజకీయాలను దాటి నియోజకవర్గంలో విజయ పతాకం ఎగురవేసింది. గడిచిన ఐదేళ్లలో ఫ్యాన్‌ గుర్తుకు కంచుకోటగా మారిన కందుకూరు నియోజకవర్గంలో ఈసారి ఆ రెండు కుటుంబాల్లో ఒక కుటుంబానికి చెందిన మాజీమంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైఎస్సార్‌ సీపీ నుంచే పోటీచేస్తుండటంతో ఆ పార్టీ బలం మరింత పెరిగింది.

అంతేగాకుండా ఈ నియోజకవర్గంలో ఆది నుంచీ టీడీపీ అంతంతమాత్రంగానే ఉంది. దీంతో పాటు గత ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ నుంచి పోటీచేసి గెలిచిన పోతుల రామారావు అనంతరం టీడీపీలోకి మారి వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ప్రస్తుతం టీడీపీ నుంచి అతనే బరిలో ఉన్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్పినప్పటికీ ఎలాంటి అభివృద్ధీ చేయకపోగా, తెలుగు తమ్ముళ్ల అవినీతి అక్రమాలకు అండగా నిలిచారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల నిధులన్నింటినీ పచ్చ నేతలకే దోచిపెట్టారు. వీటన్నింటిపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసహనం, ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీపరంగా, అభ్యర్థిపరంగా పూర్తిస్థాయిలో బలంగా ఉన్న వైఎస్సార్‌ సీపీదే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ విజయమని రాజకీయ విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు.

ఎన్టీఆర్‌ ప్రభంజనంలోనూ ఓడిపోయిన టీడీపీ.. మానుగుంట కుటుంబానిదే ఆ ఎన్నికల్లో విజయం...
కందుకూరు నియోజకవర్గం 1952లో ఏర్పడగా ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగ్గా, తెలుగుదేశం పార్టీకి కేవలం రెండుసార్లు మాత్రమే విజయం దక్కిందంటే ఇక్కడ ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గంలో మొదటి నుంచి మానుగుంట–దివి కుటుంబాల మధ్యే రాజకీయం నడుస్తూ వచ్చింది. వారిలో దివి కుటుంబం ఈసారి పోటీలో లేకుండా పోయింది. 1957లో జరిగిన ఎన్నికల్లో దివి కుటుంబం మొదటిసారి రాజకీయ రంగ ప్రవేశం చేసి దివి కొండయ్యచౌదరి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1972లో మొదటిసారి మానుగుంట కుటుంబం రాజకీయాల్లోకి ప్రవేశించగా, ఆ ఎన్నికల్లో మానుగుంట ఆదినారాయణరెడ్డి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి 2014 ముందు వరకు మానుగుంట కుటుంబం నియోజకవర్గ రాజకీయాల్లో చెరగని ముద్రవేసింది.

1983లో ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినా కందుకూరులో మాత్రం ఆ పార్టీకి ఎదురుగాలే వీచింది. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన మానుగుంట ఆదినారాయణరెడ్డి టీడీపీని ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ తరఫున మొదటిసారి బరిలో దిగిన ఆదినారాయణరెడ్డి మరోసారి టీడీపీని ఓడించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో తండ్రి వారసత్వంగా మొదటిసారి మానుగుంట మహీధర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 1994లో జరిగిన ఎన్నికల్లో దివి కుటుంబం నుంచి తండ్రి కొండయ్యచౌదరి వారసత్వంగా దివి శివరాం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004, 2009 ఎన్నికల్లో మానుగుంట మహీధర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌ కనుమరుగై ఆ ఎన్నికల్లో మహీధర్‌రెడ్డి పోటీకి దూరంగా ఉండగా, టీడీపీ అభ్యర్థి దివి శివరాంపై వైఎస్సార్‌ సీపీ విజయం సాధించింది.

నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు...
 

ఎన్నికల
సంవత్సరం 
గెలిచిన అభ్యర్థి, పార్టీ   ప్రత్యర్థి, పార్టీ
1952  (ద్విసభ్య)
 చెంచురామనాయుడు (కాంగ్రెస్‌)
 కె.షణ్ముఖం (కాంగ్రెస్‌)     
 జీవీ సుబ్బయ్య (ఇండిపెండెంట్‌)
 సి.కత్తిలింగం (ఇండిపెండెంట్‌)
1957  దివి కొండయ్యచౌదరి (కాంగ్రెస్‌)      ఆర్‌.వెంకయ్య (సీపీఐ)
1962  నలమోతు చెంచురామనాయుడు   (కాంగ్రెస్‌)    దివి కొండయ్యచౌదరి   (ఇండిపెండెంట్‌)
1967  నలమోతు చెంచురామనాయుడు   (కాంగ్రెస్‌)  వీవై కోటారెడ్డి (ఇండిపెండెంట్‌)
1972    మానుగుంట ఆదినారాయణరెడ్డి   (ఇండిపెండెంట్‌)  చెంచురామనాయుడు (కాంగ్రెస్‌)
1978  దివి కొండయ్యచౌదరి (కాంగ్రెస్‌.ఐ)      మానుగుంట ఆదినారాయణరెడ్డి (జనతా)
1983   మానుగుంట ఆదినారాయణరెడ్డి   (ఇండిపెండెంట్‌)   గుత్తా వెంకటసుబ్బయ్య (టీడీపీ)
1985  మానుగుంట ఆదినారాయణరెడ్డి   (కాంగ్రెస్‌)  గుత్తా వెంకటసుబ్బయ్య(టీడీపీ)
1989      మానుగుంట మహీధర్‌రెడ్డి  (కాంగ్రెస్‌)    ఎం.మాలకొండయ్య(టీడీపీ)
1994  దివి శివరాం (టీడీపీ)  మానుగుంట మహీధర్‌రెడ్డి   (ఇండిపెండెంట్‌)
1999  దివి శివరాం (టీడీపీ)  మానుగుంట మహీధర్‌రెడ్డి   (కాంగ్రెస్‌)
2004  మానుగుంట మహీధర్‌రెడ్డి   (కాంగ్రెస్‌)      దివి శివరాం (టీడీపీ)
2009  మానుగుంట మహీధర్‌రెడ్డి   (కాంగ్రెస్‌)    దివి శివరాం (టీడీపీ)
2014  పోతుల రామారావు (వైఎస్సార్‌ సీపీ)  దివి శివరాం (టీడీపీ)

మండలాల వారీగా ఓటర్లు...

మండలం  పురుషులు    స్త్రీలు  ఇతరులు      మొత్తం ఓటర్లు
కందుకూరు మున్సిపాలిటీ  21,316  22,072  19  43,388
కందుకూరు మండలం  14,129  14,171   00  28,300
వలేటివారిపాలెం మండలం    16,190  16,208  03  32,401
లింగసముద్రం మండలం  14,516  14,097    02  28,615
గుడ్లూరు మండలం  18,410  18,360  00  36,770
ఉలవపాడు మండలం  20,549  20,263  02  40,814

అంతర్గత పోరుతో టీడీపీ సతమతం...
నియోజకవర్గంలో అంతర్గతపోరుతో టీడీపీ సతమతమవుతోంది. 2014లో వైఎస్సార్‌ సీపీ నుంచి గెలిచిన పోతుల రామారావు అనంతరం టీడీపీలోకి మారడంతో అనాధిగా పార్టీలో కొనసాగుతున్న దివి శివరాం వర్గానికి కంటగింపుగా మారింది. ఈ రెండువర్గాల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఆ తర్వాత అధిష్టానం మాటకు దివి శివరాం తలొగ్గినా ద్వితీయశ్రేణి నాయకులు మాత్రం పోతుల వర్గంతో కలిసే పరిస్థితి లేకుండా పోయింది. శివరాం సోదరులైతే పూర్తిగా పోతుల వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దివి కుటుంబాన్ని రాజకీయంగా ఇబ్బందిపెట్టిన పోతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో సహకరించేది లేదని వారు బహిరంగంగానే చెబుతున్నారు. ఇప్పటికే శివరాం సోదరుడు దివి లింగయ్యనాయుడు వైఎస్సార్‌ సీపీలో చేరారు. ద్వితీయ శ్రేణి నాయకులు పలువురు పోతులతో విభేదించి ఏకంగా ఆ పార్టీకే గుడ్‌బై చెబుతున్నారు. దీంతో టీడీపీ డీలాపడగా, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఆ పార్టీ అభ్యర్థి మహీధరరెడ్డి నేతృత్వంలో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామాలన్నీ వైఎస్సార్‌ సీపీ విజయాన్ని స్పష్టం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు