కందుకూరు మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్

6 Aug, 2013 05:33 IST|Sakshi

 కందుకూరు అర్బన్, న్యూస్‌లైన్  : అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి స్వార్థానికి కందుకూరు మున్సిపల్ ఎన్నికకు బ్రేక్ పడింది. మున్సిపాలిటీ పరిధిలో పట్టణానికి సమీపంలోని గ్రామాలుంటే ఓటమి తప్పదని సదరు నేత భావిస్తున్నారు. మున్సిపాలిటీ నుంచి విడగొట్టడంతో ఆనంద పురం, దివివారిపాలెం పంచాయతీలు అభివృద్ధికి దూరమయ్యాయి. అనందపురం పంచాయతీలో చుట్టుగుంట, శామీరిపాలెం, కండ్రావారిపాలెం, గళ్లవారిపాలెం, ముక్కోడుపాలేలు ఉన్నాయి. దివివారిపాలెం పంచాయతీలో గనిగుంట ఉంది. ఈ గ్రామాలను కలిపి 1987లో అప్పటి టీడీపీ నేతలు పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేశారు.
 
  ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కందుకూరు పురపాలక సంఘాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో టీడీపీ బలంగా ఉండటమే ఇందుకు కారణం. 2004 శాసనసభ ఎన్నికల్లో కందుకూరు నుంచి మహీధర్‌రెడ్డి గెలుపొందారు. అప్పటి వరకూ టీడీపీ చేతుల్లో ఉన్న మున్సిపాలిటీని కైవసం చేసుకొనేందుకు ఆయన పావులు కదిపారు. తన వ్యక్తిగత స్వార్థం కోసం తెలుగుదేశం కలుపుకున్న గ్రామాలను ఏకపక్షంగా మున్సిపాలిటీ నుంచి అప్పటి ఆర్డీఓ ద్వారా తొలగింపజేశారు. ఆయా గ్రామాల ప్రజలకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ వ్యవహారాన్ని టీడీపీ నేతలు కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 2007లో మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. టీడీపీ నేతలు అప్పుడు నిద్రలేచారు.
 
 మున్సిపాలిటీ నుంచి విడిపోయిన గ్రామాలను మళ్లీ విలీనం చేయాలని కోర్టును ఆశ్రయించారు. 2010లో వీరికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. విడిపోయిన గ్రామాలను మళ్లీ విలీనం చేసేందుకు వీల్లేదని మంత్రి అనుచరులు కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల స్వార్థానికి ఆనందపురం, దివివారిపాలెం పంచాయతీల్లోని గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నాయి. మున్సిపాలిటీ నుంచి విడిపోయినప్పటి నుంచి ఆ రెండు పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. రెండు పార్టీల నాయకుల ప్రజా సమస్యలు పక్కన పెట్టి తమ స్వార్థం కోసం ప్రజలతో చెలగాటం ఆడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆ గ్రామాలను మున్సిపాలిటీలో కొలుపుకొని విజయం సాధించిగా, కాంగ్రెస్ పార్టీ ఆ గ్రామాలను విడగొట్టి విజయ సాధించి తమ గ్రామాలను అభివృద్ధికి దూరం చేశాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. మంత్రి స్వార్థానికి ఈ గ్రామాలను మున్సిపాలిటీ నుంచి విడదీసేందుకు అధికారులు సుమారు * 8 లక్షలు ఖర్ఛు చేసినట్లు సమాచారం.   
 
 ప్రజా సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్
 కందుకూరు పట్టణంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలు పట్టించకోవటం లేదు. ఆ పార్టీ నేతలు చేస్తున్న అక్రమాలపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ఏ రోజూ స్పందించిన దాఖలాలు లేవు. దీంతో కాంగ్రెస్ పార్టీ అవినీతికి అడ్డూ అదుపులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్ సీపీ ప్రజలకు అండగా నిలిచింది. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలపై పోరాటానికి దిగి ంది. ప్రజలపై ప్రభుత్వం పెంచిన భారాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది. ఈ నేపథ్యంలో పట్టణ ప్రజలు వైఎస్సార్ సీపీకి బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కందుకూరులో మున్సిపల్ ఎన్నికలు జరిగితే వైఎస్సార్ సీపీ పాగా వేయడం ఖాయమని తెలిసే ఆ రెండు పార్టీల నాయకులు ఎన్నికలు జరగకుండా ఉండేందుకు కుట్రపన్నుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
 
 

మరిన్ని వార్తలు