మోదీని గద్దె దించే సమయమొచ్చింది

28 Sep, 2018 12:20 IST|Sakshi

కన్హయ్య కుమార్, జిగ్నేష్‌ మేవాని  

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పి మోదీని గద్దె దించే సమయం ఆసన్నమైందని జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్యకుమార్, గుజరాత్‌ శాసనసభ్యుడు జిగ్నేష్‌ మేవానిలు పేర్కొన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ 29వ జాతీయ మహాసభల సందర్భంగా ఆర్ట్స్‌ కళాశాల క్రీడా మైదానంలో గురువారం మహాసభను నిర్వహించారు. ముందుగా ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్, టవర్‌క్లాక్‌ మీదుగా ఆర్ట్స్‌ కళాశాల మైదానం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ ఏఐఎస్‌ఎఫ్‌ జెండాలతో నిండిపోయాయి.  ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు వలీఉల్లాఖాద్రీ అధ్యక్షతన జరిగిన సభలో కన్హయ్య కుమార్‌ మాట్లాడుతూ దేశంలో భావప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తున్నారని తెలిపారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా మాట్లాడిన పౌరులపై అక్రమంగా దేశద్రోహం కేసులు బనాయించి జైళ్లల్లో నిర్బంధిస్తోందన్నారు. ప్రశ్నించే జర్నలిస్టులు, మేధావులపై హిందుత్వ సంస్థలు దాడులు చేయడమేగాక కొన్ని చోట్ల హత్యలకు తెగబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను ఎవరు అడ్డుకోలేరని తెలిపారు. దేశంలో దళితులు, ముస్లింలు, మహిళలు, ఆదివాసీలపై సంఘ్‌ పరివార్‌ శ్రేణులు దాడులకు దిగుతున్నా కేంద్రం చోద్యం చూస్తోందన్నారు. హిందుత్వ దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఎన్‌యూలో విద్యార్థి నజీబ్‌పై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేసి వేలాదిమంది విద్యార్థుల సమక్షంలోనే కిడ్నాప్‌ చేశారని ఆరోపించారు. నజీబ్‌ తల్లి తన కుమారుడి ఆచూకీ తెలపాలని పోరాడుతున్నా పట్టించుకోక పోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానకరమన్నారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా విద్యార్థులందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

మాల్యా, నీరవ్‌మోదీ రక్షించేందుకు యత్నం
జిగ్నేష్‌ మేవాని మాట్లాడుతూ బ్యాంకులను లూటీ చేసి వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీలను రక్షించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. వారిని దేశద్రోహులుగా ప్రకటించి జైళ్లల్లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడేవారిపై దేశద్రోహం కేసులు పెట్టి నిర్బంధించడం అన్యాయమన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన కూడు, గూడు, నీరు, విద్య, వైద్యం, ఉపాధి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి గోసంరక్షణ పేరుతో గోరక్షక దళాలను ఏర్పాటు చేసి దాడులు, హత్యలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు సామాజిక బాధ్యతగా తీసుకుని ఇలాంటి వాటిపై పోరాటాలు సాగించాలని కోరారు. గ్రామాల్లోని దళితులు, ఆదివాసీలకు ప్రభుత్వ నిజస్వరూపాన్ని తెలియజేసి ప్రజలకు చైతన్యం చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని మోదీ అమలు చేయలేదన్నారు. రాఫెల్‌ కుంభకోణం దేశంలోనే అతిపెద్దదని తెలిపారు. ఈ ఒప్పందాన్ని హెచ్‌ఏఎల్‌కు కాకుండా ఎలాంటి అనుభవం లేని అంబానీ కంపెనీకి కాంట్రాక్టు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. కాపలాదారుగా చెప్పుకుంటున్న మోదీ పెద్ద దొంగగా మారారని విమర్శించారు. డీజిల్, పెట్రోలు ధరలు సెంచరీకి చేరువలో ఉన్నాయన్నారు.

విద్యార్థుల సమస్యలపై కార్యాచరణ
ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్‌కుమార్‌ మాట్లాడుతూ మోదీ  ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలు, దేశంలో విద్యార్థులు ఎదుర్కుంటున్న సమస్యలపై  మహాసభలో  చర్చించి కార్యచరణ రూపొందిస్తామన్నారు. విద్యారంగ సమస్యలపై నిరంతర పోరాటాలు సాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ బాలికల విభాగం జాతీయ కన్వీనర్‌ కరంబీర్‌కౌర్, జాతీయ నాయకులు విక్కీమహేసరి, పంకజ్‌ చౌహాన్, సుఖేష్‌ సుధాకర్, అమృత, మొహమ్మద్‌మోబీన్, స్టాలిన్, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు సుబ్బారావు, జీ రంగన్న, అనంతపురం జిల్లా అధ్యక్షుడు మధు, కార్యదర్శి జాన్సన్‌బాబు, మనోహర్, ఏఐఎస్‌ఎఫ్‌ మాజీ నాయకులు ఈశ్వరయ్య, లెనిన్‌బాబు, నారాయణస్వామి, వేమయ్య యాదవ్, రాజారెడ్డి, బయన్న, రమణ, సీపీఐ నాయకులు ఎంబీరమణ, జాఫర్, సంజీవప్ప, మల్లికార్జున, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతుల ఆత్మహత్యలను పట్టించుకోని కేంద్రం
 సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో పెద్ద ఎత్తున రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. దేశంలో జరుగుతున్న అరాచకాలను రూపుమాపేందుకు ఏఐఎస్‌ఎఫ్‌  బాధ్యత తీసుకోవాలన్నారు. బ్రిటీషు వారిని తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టులదని, అదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు