చివరి మృతదేహం దొరికే వరకూ గాలింపు చర్యలు

18 Sep, 2019 20:44 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : గోదావరిలో ప్రమాదానికి గురైన లాంచీలో గల్లంతైన వారి సంఖ్య పెరిగిందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. సంఘటన స్థలంలో చర్యలను బుధవారం సాయంత్రం మంత్రులు కురసాల కన్నబాబు, విశ్వరూప్‌ పరిశీలిస్తున్నారు. తాజా సమాచారం మేరకు లాంచీలో ప్రయాణించిన 73 మందిని గుర్తించినట్లు వారిలో 26 మంది సురక్షితంగా బయటపడగా.. 34 మృతదేహాలను గుర్తించారని తెలిపారు. కాగా ఈ రోజు మరో ఐదుగురు కనిపించడం లేదని వారి బంధువులు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారని అన్నారు. దీనిని బట్టి చూస్తే బోటులో ఇంకా 18 మంది గల్లంతైన వారి ఆచూకీ తెలియాల్సి ఉందని మంత్రి తెలిపారు. 

లాంచీ మునిగిన ప్రాంతంలో గోదావరి  ప్రమాదకరంగా ఉందని, బురద ఉండడంతో సైడ్ సోనార్ స్కానర్ పంపించినా లాంచీ చిత్రాలు లభించలేదని అన్నారు. కచ్చులూరు నుంచి సముద్ర మొగ వరకు మిగిలిన 13 మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతాయని, ఘటన జరిగిన ప్రాంతం నుంచి లాంచీ ఎలా తీయలనే దానిపై నిపుణులు పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. దీని కోసం ముంబై, జార్ఖండ్, విశాఖ, కాకినాడ నుంచి పలు బృందాలు లాంచీ వెలికితీసేందుకు పనిచేస్తున్నాయన్నారు. లాంచీలో ఏ ఒక్క మృతదేహం లభించినా తమకు ముఖ్యమేనని, చివరి మృతదేహం దొరికే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సంఘటన ప్రాంతంలో కొనసాగుతున్న చర్యలపై ఇరు రాష్టాల ముఖ్యమంత్రులు అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు