హోదా ఇవ్వడం జరిగేది కాదు : కన్నా

29 Aug, 2019 11:54 IST|Sakshi

సాక్షి, గిద్దలూరు(ప్రకాశం) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగేది కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం కర్నూలు నుంచి విజయవాడ వెళ్తూ మార్గంమధ్యలో గిద్దలూరు నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి పిడతల సరస్వతి నివాసానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని ఎప్పుడో చెప్పారని, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకు మించి ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇచ్చామన్నారు. ఆ నిధులను అప్పటి ప్రభుత్వం ఇష్టానుసారంగా ఖర్చు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. అందుకే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారన్నారు. ప్రస్తుతం టీడీపీ భయంగా బతుకుతోందన్నారు.

గత ప్రభుత్వం అవినీతి చేస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన కన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాస్తే తప్పకుండా విచారణ చేయిస్తామన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించలేక టీడీపీ ఇబ్బంది పడుతోందని, రాష్ట్రంలో బీజేపీనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందన్నారు. మంచి ప్రతిపక్షంగా ఉంటూ రాష్ట్రంలో ప్రజల అభిమానాన్ని సంపాదించి 2024లో వైఎస్సార్‌సీపీకి ప్రధాన పోటీగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉందని, రాచర్ల గేటులో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలని  పిడతల సరస్వతి కన్నాను కోరారు.  కన్నా లక్ష్మీనారాయణతో పాటు నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి శశిభూషణ్‌రెడ్డి, పలువురు నాయకులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు