వైఎస్సార్‌సీపీలోకి ‘కనుమూరు’

26 Jan, 2019 05:07 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన కనుమూరు రవిచంద్రారెడ్డి. చిత్రంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు

వైఎస్‌ జగన్‌ సమక్షంలో చేరిన కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి, నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన కనుమూరు రవిచంద్రారెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఈయనతోపాటు ఆయన సోదరుడు కనుమూరు హరిచంద్రారెడ్డి, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన బచ్చు నారాయణమూర్తిలకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు..
ప్రభుత్వంపై పోరాడాల్సిన కాంగ్రెస్‌.. టీడీపీతో కుమ్మక్కై పనిచేస్తున్నాయని రవిచంద్రారెడ్డి ఆరోపించారు. ఒక రహస్య ఎజెండాతో కాంగ్రెస్, టీడీపీలు ముందుకు వెళ్తున్నాయని తెలిపారు. 60–70 అసెంబ్లీ స్థానాల్లో 10 వేల ఓట్ల చొప్పున చీల్చడానికి ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రఘువీరారెడ్డి టీడీపీతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. టీడీపీ అవినీతిని ఎండగట్టి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి సర్కారుపై పోరాడాల్సిన కాంగ్రెస్‌ ఈ తరహా విధానాలు తనకు ఏమాత్రం నచ్చలేదని చెప్పారు. సీఎం చంద్రబాబు రాహుల్‌ గాంధీతో పొత్తు పెట్టుకోవడాన్ని కాంగ్రెస్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ఆశయాల కోసం పనిచేస్తామని హరిచంద్రారెడ్డి చెప్పారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజీవయ్య, నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి, పార్టీ సీఈసీ మెంబర్‌ గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు