కన్నుపడింది..కప్పేశారు!

6 Jun, 2014 02:33 IST|Sakshi
  •       అమలాపురంలో గెడ్డ, చెరువు ఆక్రమణ
  •      రూ.2 కోట్ల విలువైన భూమికి టెండర్
  •      గెడ్డ, చెరువులను కప్పేసి కొబ్బరి, టేకు సాగు
  •      ఆర్డీవో తనిఖీతో వెలుగులోకి కుంభకోణం
  •      రెవెన్యూ సిబ్బంది పాత్రపై అనుమానాలు
  •  నక్కపల్లి,న్యూస్‌లైన్: కన్నుపడిందే తడవు అక్రమార్కులు చెలరేగిపోయారు. ఏకంగా చెరువు, కాలువలను పొక్లయిన్‌తో కప్పేసి చదును చేసేశారు. దాదాపు రూ. 2 కోట్ల విలువైన భూమిని దర్జాగా ఆక్రమించేసి టేకు, కొబ్బరి సాగు చేపట్టేశారు. ఇంత జరిగినా మండల రెవెన్యూ సిబ్బందికి ఈ విషయం తెలియదట. అసలు వారికి సమాచారమే లేదట. గురువారం మండలంలోని ప్రభుత్వ భూముల వివరాల సేకరణకు వచ్చిన నర్సీపట్నం ఆర్డీవో సూర్యారావు పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానిక రెవెన్యూ సిబ్బందిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారినందునే రెవెన్యూ సిబ్బంది నోరు మెదపలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే... అమలాపురం సర్వే నంబర్ 270లో 18.7 ఎకరాలు గెడ్డ ప్రాంతం, సర్వే నంబర్ 295లో 4.17 ఎకరాలు చెరువు గర్భం ఉంది. వీటిని ఆనుకుని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎస్.ఈశ్వరరెడ్డి కుటుంబీకులకు సర్వేనంబర్ 294/1లో 1.2 ఎకరాలు, సర్వే నంబర్ 294/2లో 1.22 ఎకరాలు, 294/3ఎలో 1.85 ఎకరాలు, 294/3బిలో 0.25 సెంట్లు జిరాయితీ భూమి ఉంది.

    ఈ భూములను ఆనుకుని రెవెన్యూ రికార్డుల్లో గెడ్డగా నమెదయిన 5 ఎకరాలతోపాటు పద్దరాజు చెరువుగా రికార్డుల్లో ఉన్న 4.17 ఎకరాల్లో కొంతభూమిని  అప్పలకొండ, సూర్యనారాయణరాజు, ఈశ్వరరెడ్డి అనే వ్యక్తులు ఆక్రమించేశారు. అందులో డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని విస్తరించేశారు. కబ్జా భూముల్లో బోర్లు ఏర్పాటు కోసం విద్యుత్‌లైన్లు ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.  చెరువును అడ్డంగా తవ్వి జిరాయితీ, ఆక్రమిత భూముల్లోకి రాకపోకలు సాగించేందుకు పక్కారోడ్డు కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.

    కొంతమంది సిబ్బంది సహాయంతో ఆక్రమిత భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు సంపాదించేందుకు కబ్జాదార్లు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు భోగట్టా. కోస్తాతీరం వెంబడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పీసీపీఐఆర్‌లో నక్కపల్లి మండలం క్లస్టర్‌గా ఉంది.  పీసీపీఐఆర్‌కోసం సేకరించే భూముల్లో అమలాపురం కూడా ఉండటంతో ఆక్రమణదార్లు ప్రభుత్వ భూములపై దృష్టిసారించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో భూముల ధర ఎకరా రూ15 నుంచి 20 లక్షలు పలుకుతోంది.

    ప్రభుత్వం సేకరించినా దాదాపు ఇదేధర ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిరాయితీతోపాటు డీఫారం పట్టాభూములకు 70 శాతం నష్టపరిహారం వచ్చే అవకాశం ఉండటంతో కబ్జాదారుల కన్ను ప్రభుత్వ భూములపై పడుతోంది. ఆక్రమణపై ఫిర్యాదు అందడం వల్లే తనిఖీలకు వచ్చారని మరికొందరు చెప్పుకుంటున్నారు.
     
     అనుమానంతో పరిశీలన

     ఆక్రమణలపై ఎటువంటి ఫిర్యాదు అందలేదు. మండలంలోని ప్రభుత్వ భూముల పరిశీలనకు మాత్రమే అమలాపురం వచ్చాను. చెరువు గర్భంలోంచి రోడ్డు వేయడం చూసి అనుమానంతో ఆరాతీశాను. రోడ్డువేసిన ప్రాంతాన్ని ఆనుకుని సాగులో ఉన్న భూములు ప్రభుత్వానివని రెవెన్యూ అధికారుల నుంచి వివరణ వచ్చింది. దీంతో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని గుర్తించాను. అయితే ఎంత భూమి ఆక్రమణకు గురైందన్న దానిపై పూర్తి వివరాలు సర్వేచేసి ఇవ్వాలని తహశీల్దార్, సర్వేయర్‌లను ఆదేశించడం జరిగింది. నివేదిక వచ్చాక చర్యలు ఉంటాయి.
     - సూర్యారావు, నర్సీపట్నం ఆర్డీవో
     

మరిన్ని వార్తలు