కాపు రుణాలు కంటితుడుపే!

26 Feb, 2016 00:48 IST|Sakshi

 కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు అందించే సంక్షేమ రుణాలు కంటి తుడుపుగా మారుతున్నాయి. జిల్లాలో సుమారుగా 20 వేల కుటుంబాలకు చెందిన కాపు, తెలగ, బలిజ కులస్తులు ఉండగా, కేవలం 786 యూనిట్లు మాత్రమే లక్ష్యంగా తీసుకున్నారు. ఎన్నికల హామీ మేరకు ఆ కులాలకు  రుణాలు కల్పించేందుకు ప్రత్యేక కమిషన్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినా, వారిక ఈ సంస్థ వల్ల  ఆశించిన ప్రయోజనం కలగడం లేదు. నిబంధనాలతోపాటు.. జన్మభూమి కమిటీల జోక్యంతో లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి.
 
 శ్రీకాకుళం పాతబస్టాండ్ : తెల్ల కార్డు కలిగి, గ్రామీణ ప్రాంతాలవారికి వార్షిక ఆదాయం రూ.60 వేలు, పట్టణ ప్రాంతాలవారికి రూ.75 వేల కంటే తక్కువ ఉన్నవారు కాపు రుణాలకు అర్హులు. 21నుంచి 45 సంవత్సరాల మధ్య వయ స్సు కలిగి ఉండి, కుల ధ్రువ పత్రం తప్పని సరి. యూనిటుమొత్తం రూ.2 లక్షలు కాగా, బ్యాంకు రుణం రూ.లక్ష, ప్రభుత్వం సబ్సిడీ రూ.లక్ష ఉంటుంది.
 
 మండలాని 16 యూనిట్లే...
 కాపు కార్పొరేషన్ ద్వారా మండలానికి కేవలం 16 యూనిట్లు కేటాయించారు.  కొన్ని మండలాల్లో ఈ కులాలు తక్కువగా ఉన్నప్పటికీ, అర్బన్ ప్రాంతాల్లోనూ, ఎల్‌ఎన్ పేట, జి.సిగడాం, ఆర్ ఆమదాలవలస, రణస్టలం, లావేరు, పాలకొండ, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు.  వారికి ఈ రుణాలు అందే పరిస్థితి కన్పిండం లేదు. రాజకీయ ప్రమేయంతో మరింత ఇబ్బందిగా మారుతోంది.
 
 4,587 దరఖాస్తులు
 ఈ రుణాలకు ఈ నెల 20తో గడువు ముగియగా, ఇప్పటి వరకు జిల్లాలో ఆన్‌లైన్‌లో 4,587 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ఏడు మండలాల్లో కేవలం 66 యూనిట్లకు మండల కమిటీలు సిఫారసు చేశాయి. ఎచ్చెర్ల ఒకటి,  జి.సిగడాం-6, ఇచ్ఛాపురం అర్బన్-16, ఇచ్ఛాపురం రూరల్ -14, ఎల్‌ఎన్ పేట-25, రేగిడి -4, సారవకోట-3, మిగిలినవి రాజకీయ కారణాలతో అడ్డంకిగా మారుతున్నాయి.
 
 సిఫారసులు వస్తే అనుమతులిస్తాం
 మండల, పురపాలక సంఘాల నుంచి కమిటీ తీర్మానంతో కాపు రుణాల కోసం సిఫారసులు వస్తే, ఆ దరఖాస్తులను పరిశీలించి రుణం అనుమతుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని బీసీ కార్పొరేషన్ ఈడీ బి. శ్రీహరిరావు తెలిపారు.
 
 జిల్లాకు రూ.7.86 కోట్లే...
 జిల్లాకు రాయితీ రుణంగా రూ.7.86 కోట్లు కేటాయించారు. వీటితో 50 శాతం సబ్సిడీపై 786 యూనిట్ల మంజూరుకు లక్ష్యాంగా తీసుకున్నారు. అయితే ఆన్‌లైన్ దరఖాస్తుదారుల్లో అధికంగా బీసీ కాపులే ఉన్నారు. ఇక ఒంటరి కులానికి చెందిన వారు జిల్లాలో లేరు. అక్కడక్కడ కాపులు, తెలగాలు ఉన్నారు. ఇక బలిజ కులస్తులు జి.సిగడాం, వంగర మండలాల్లో ఉన్నారు. తెలగ కులస్తులు   రణస్థలం, పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్నారు.  వాస్తవమైన ఓసీ కాపు, తెలగ కులస్తులకు చెందిన కుటుంబాలు సుమారుగా 20వేల వరకు ఉన్నాయి.

మరిన్ని వార్తలు