కాపు నేతలపై నిఘా

8 Jun, 2016 00:47 IST|Sakshi

ముద్రగడను అదుపులోకి  తీసుకోవటంతో అప్రమత్తం

 

విజయవాడ : కాపు నేతలపై పోలీసు శాఖ నిఘా పెరిగింది. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జిల్లాలో ఉన్న ముఖ్య నేతల కదలికలపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. కిర్లంపూడిలో ముద్రగడ అరెస్ట్, తుని ఘటనలో కొందరిని అరెస్ట్ చేయటంతో మళ్లీ కాపు ఉద్యమ అలజడి రేగింది. ఈ క్రమంలో ముద్రగడకు సంఘీభావంగా ఎక్కడైనా కార్యక్రమాలు జరుగుతున్నాయా అనే కోణంలో దృష్టి సారించిన పోలీసులు నేతల కదలికలను పరిశీలిస్తున్నారు. ఇంటెలిజెన్స్ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని  సమీక్షిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలో, వివిధ రాజకీయ పార్టీల్లో కీలక నేతలుగా ఉన్న కాపు నేతలు, వారి అనుచరగణంపైనా నిఘా ఉంచారు. విజయవాడ రాజధాని నగరం కావటంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందస్తు చర్యలు చేపట్టారు. కమిషనరేట్ పరిధిలోని పరిస్థితిపై పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అధికారులతో చర్చించారు.


కాపు సామాజిక వర్గానికి చెందినవారు అధికంగా ఉన్న కృష్ణలంక, రాణిగారి తోట, భవానీపురం హౌసింగ్ బోర్డు తదితర ప్రాంతాలతో పాటు బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, బెంజ్ సర్కిల్ తదితర ప్రాంతాల వద్ద పోలీసులు ఎక్కువగా దృష్టిసారించారు. మరోవైపు అధికార పార్టీలో ఉన్న కాపు నేతలు ప్రభుత్వ చర్యల్ని సమర్ధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారి కార్యాలయాల వద్ద ఇంటెలిజెన్స్ నిఘా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నుంచి నగరంలో పోలీసులు కీలక ప్రాంతాల్లో సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. తుని ఘటనలో జిల్లాకు చెందినవారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో సీఐడీ కొంతకాలంగా దర్యాపు సాగిస్తోంది.

 

మరిన్ని వార్తలు