అక్రమాలు బయటపడతాయని భయమా?

16 Sep, 2018 08:27 IST|Sakshi

పోలీసులను అడ్డుపెట్టుకుని బహిరంగచర్చను నీరుగార్చారు

రాయదుర్గం వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త కాపు రామచందారెడ్డి 

బెళుగుప్ప: అక్రమాలు బయటపడతాయనే భయంతోనే పోలీసులను అడ్డుపెట్టుకుని బహిరంగ చర్చను మంత్రి కాలవ శ్రీనివాసులు నీరుగార్చారంటూ రాయదుర్గం వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. అధికారం చేపట్టిన ఈ నాలుగున్నరేళ్లలో సాధించిన నియోజకవర్గ అభివృద్ధి అంటూ ఏదీ లేదని స్పష్టం చేశారు. బెళుగుప్ప మండలం యలగలవంక గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నేత సుదర్శనరెడ్డి గృహంలో శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు ఆయనను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. 

విషయం తెలుసుకున్న ఆయన సతీమణి భారతి, అనంతపురం పార్లమెంట్‌ సమన్వయక్త తలారి పీడీ రంగయ్య అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కాపు మాట్లాడుతూ.. కాలవ శ్రీనివాసులు గతంలో ఈ ప్రాంతా ఎంపీగా ఉన్న ఐదేళ్ల కాలంలో కనీసం ఐదు సార్లు కూడా రాయదుర్గంలో పర్యటించలేదని గుర్తు చేశారు. 2002లో కణేకల్లు, బొమ్మనహాళ్‌ ప్రాంతాలకు చెందిన 173 మంది రైతులపై అకారణంగా నాటి  ప్రభుత్వం కేసులు పెడితే వారిని పరామర్శించిన దాఖలాలు కూడా లేవన్నారు. బహిరంగ చర్చ జరగకుండా పోలీసులను అడ్డు పెట్టుకుని కావాలనే తనను గృహ నిర్బంధం చేసారన్నారు.

 రాయదుర్గం నియోజకవర్గంలో 50 మందితో ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్న మంత్రి బెల్టు షాపులు, మట్కా, పేకాట లాంటి వాటిని విచ్ఛలవిడిగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ బహిరంగ చర్చలో వెలుగు చూస్తాయని భయపడ్డారన్నారు. బెళుగుప్ప సింగిల్‌విండో అధ్యక్షుడు శివలింగప్ప, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొడగట్ట క్రిష్టప్ప, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి దుద్దుకుంట రామాంజినేయులు, మండల ప్రధాన కార్యదర్శి అశోక్, పార్టీ మండల మహిళా కన్వీనర్‌ యశోదమ్మ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు