చాలీచాలని అన్నంతో సరిపెడితే సహించేదిలేదు

29 Jan, 2020 10:29 IST|Sakshi
వంటలను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి

మూడు రోజులకోసారి కూరగాయల సరఫరాపై విప్‌ కాపు ఆగ్రహం

కణేకల్లు గురుకులంను సందర్శించిన విప్‌ కాపు

అనంతపురం, కణేకల్లు: చాలీచాలని అన్నం, పల్చటి మజ్జిగతో విద్యార్థులను పస్తులు ఉంచితే సహించేదిలేదని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ ప్రసన్నకుమారి, సిబ్బందిని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి హెచ్చరించారు. మంగళవారం రాత్రి కణేకల్లుక్రాస్‌లోని గురుకుల పాఠశాలను ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నం, సాంబారు, వంకాయకూరలను విప్‌ కాపు పరిశీలించారు.అన్నం, మజ్జిగ తక్కువగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కూరగాయలను సంబంధిత కాంట్రాక్టర్‌ ఎన్ని రోజులకోసారి సరఫరా చేస్తున్నారని ప్రిన్సిపాల్‌ను విప్‌ ప్రశ్నించగా రోజూ కూరగాయలు సరఫరా చేస్తారని ఆమె సమాధానమిచ్చారు. అదే సమయంలో మెస్‌ కేర్‌టేకర్‌ వేణుగోపాల్‌రావు అక్కడికి రాగా.. విప్‌ కాపు మెనూ, కూరగాయల సరఫరా గురించి అడిగారు. ప్రిన్సిపాల్, మెస్‌ కేర్‌టేకర్‌ పొంతనలేని సమాధానం చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. ఇకపై రోజూ తాజాకూరగాయలు కాంట్రాక్టర్‌తో తెప్పించుకోవాలని కాపు సూచించారు. 

స్టోర్‌ రూం పరిశీలన ..
అనంతరం స్టోర్‌రూమ్‌కెళ్లి కూరగాయలు, పప్పుదినుసులను  విప్‌ కాపు పరిశీలించారు. క్యారెట్, కూరగాయలు వాడిపోయి ఉండడంతో ఇలాంటివి విద్యార్థులకు వండిపెడితే అనారోగ్యానికి గురికారా? అని ప్రశ్నించారు. ఇలాంటివి మన ఇళ్లలో తింటామా? అని మెస్‌ కేర్‌టేకర్‌కు చురకలంటించారు.  

సిబ్బంది క్వార్టర్స్‌పై ఆరా..  
గురుకులంలో పని చేసే ఉపాధ్యాయుల నివాసంపై విప్‌  ఆరా తీశారు. ఇక్కడెన్ని క్వార్టర్స్‌ ఉన్నాయి..ఎవరెవరు ఉంటున్నారని ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఆలూరు చిక్కన్న,  మాజీ జెడ్పీటీసీ పాటిల్‌ నాగిరెడ్డి, కణేకల్లు పట్టణ  కన్వీనర్‌ టి.కేశవరెడ్డి, మాజీ సర్పంచ్‌ పాటిల్‌ చెన్నకేశవరెడ్డి, నాయకులు గంగలాపురం ముత్తు, గోవిందరాజులు, ప్రతాప్, పెద్దదేవర ఖలందర్‌ పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా