నా జోలికొస్తే.. నీ అంతు చూస్తా..!

16 Aug, 2019 07:17 IST|Sakshi

సాక్షి, చీరాల : స్థానిక మండల పరిషత్, తహసీల్దార్‌ కార్యాలయాల్లో గురువారం నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. స్వాతంత్య్ర దినోత్సవానికి రాజకీయ రంగు పులమడంతో కార్యక్రమం రసాభాసగా ముగిసింది. టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం తన మందీమార్బలంతో మరోసారి తన నైజాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయగా వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు బలరాంను స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద అంతే రీతిగా అడ్డుకున్నారు. బలరాం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఉదయం 8 గంటలకు తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు.

బలరాం జిందాబాద్‌.. అంటూ టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు  పాల్పడ్డారు. వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గీయులు జై ఆమంచి.. అంటూ నినాదాలు చేయడంతో ఇరువర్గాలు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి, సబ్‌ డివిజన్‌లోని సీఐలు నాగమల్లేశ్వరరావు, ఫిరోజ్, రాంబాబుతో పాటు పలువురు ఎస్‌ఐలు, ఏఆర్, సివిల్‌ పోలీసులు భారీగా మోహరించి బారికేడ్లతో ఇరువర్గాలను కట్టడి చేశారు. తహసీల్దార్‌ కార్యాలయంలోకి ఎవరినీ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఒక వైపు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మరోవైపు భారీగా మోహరించిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలతో ఆంధ్రరత్న రోడ్డు నిండిపోయింది. 

నన్నే ప్రశ్నిస్తావా..?
ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే బలరాం జాతీయ జెండా ఆవిష్కరణకు వెళ్లగా అక్కడే ఉన్న వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత యడం రవిశంకర్‌ ‘మీరేనా వచ్చేది.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో పాటు వైఎస్సార్‌ సీపీ నేతలను ఎందుకు కార్యక్రమానికి హాజరు కానివ్వడం లేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. తీవ్ర ఆగ్రహానికి గురైన బలరాం ‘నువ్వెవడవి రా..వెధవ.. నన్ను ప్రశ్నిస్తావా.. నీ అంతు చూస్తా..అంటూ హెచ్చరించారు. ఎందుకు పిలువలేదో వెళ్లి వాడిని (ఎంపీడీవోని ఉద్దేశించి) అడుగు..అంటూ హెచ్చరించాడు.

దీంతో యడం రవిశంకర్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఉన్న నీవు ప్రజలను బూతులు తిట్టడం సరికాదని, మాట్లాడే తీరు మార్చుకోవాలని హితవు పలికారు. టూటౌన్‌ సీఐ ఫిరోజ్‌ యడం రవిశంకర్‌ను అక్కడి నుంచి పంపించేశారు. కారులో వెళ్తున్న బలరాం రవిశంకర్‌ను పిలిచి ‘మరోసారి నా జోలికి వస్తే.. నా క్యారెక్టర్‌ చూపిస్తా..ఒళ్లు దగ్గర పెట్టుకో.. లేకుంటే నీ అంతు చూస్తా’ అంటూ కారులో నుంచే బెదిరించాడు. అనంతరం బలరాం తహసీల్దార్‌తో గంటసేపు మాట్లాడి గొడవను పెద్దది చేసేందుకు వ్యూహ రచన చేసి పోలీసులు వద్దని చెబుతున్నా వినకుండా నేరుగా ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని తన అనుచరులతో మంతనాలు చేశారు. వైఎస్సార్‌ సీపీ నేతలను ఎలాగైనా కొట్టాలంటూ భారీగా టీడీపీ నాయకులతో కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. బలరాం తీరుపై మండిపడ్డ వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు ఆర్‌అండ్‌బీ బంగ్లాకు వెళ్లేందుకు యత్నించగా చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి, పోలీసులు అడ్డుకునే యత్నం చేయడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. 

అద్దంకి తరహా రాజకీయం
మసీదు సెంటర్‌లో ఉన్న వైఎస్సార్‌ సీపీ నేతలను పంపించేందుకు పోలీసులు యత్నించారేగానీ టీడీపీ నేతలను పంపే చర్యలు చేపట్టలేదు. వైఎస్సార్‌ సీపీ నేతలు గడియార స్తంభం సెంటర్‌కు చేరుకుని బలరాంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశాంతంగా ఉన్న చీరాల్లో అద్దంకి తరహా రాజకీయాలు చేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, బలరాం డౌన్‌.. డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. డీఎస్పీ వచ్చి వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్‌ తమ్ముడు స్వాములుతో చర్చించి మీరు.. మీ అనుచరులు ఇక్కడి నుంచి వెళ్లండి.. టీడీపీ నాయకులను నేను పంపిస్తా.. అంటూ డీఎస్పీ చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం వైఎస్సార్‌ సీపీ నేతలు, నాయకులు గడియారం స్తంభం సెంటర్లోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులతర్పించి డ్రైనేజీ అతిథి గృహానికి చేరుకున్నారు. అంతటితో ఉద్రిక్తత వాతావరణం కాస్త సద్దుమణిగింది.  

మరిన్ని వార్తలు