ఆత్మరక్షణ కోసం బాలికలకు కరాటేలో శిక్షణ

23 Oct, 2013 03:49 IST|Sakshi

మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : ఢిల్లీలో వైద్య విద్యార్థిని నిర్భయపై జరిగిన లైంగికదాడి, హత్య నేపథ్యంలో పిల్లలను బోధనకు పంపించాలంటే తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో చదువుతోపాటు ఆత్మరక్షణ కోసం బాలికలు కరాటేలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రాథమిక, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బాలికలకు శిక్షణ ఇవ్వాలని సన్నాహాలు చేస్తుందని మంత్రి ప్రకటనలో స్పష్టమైంది. కాగా, జిల్లావ్యాప్తంగా 2,911 ప్రాథమిక, 412 ప్రాథమికోన్నత, 387 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2 లక్షలకుపైగా విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. బాలికలకు కరాటేలో శిక్షణ ఇవ్వాలంటే బాధ్యతను వ్యాయామ ఉపాధ్యాయులకు అప్పగించాలి. కానీ, వ్యాయామ ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారు. ఈ పోస్టులను భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం లేదు. లేకపోతే కాంట్రాక్ట్ పద్ధతిన కరాటే మాస్టర్లను అయినా నియమించాలి. ఏ విధంగా అమలు చేస్తుందో వేచిచూడాల్సిందే.
 
జెడ్పీహెచ్‌ఎస్‌లలో కొంతకాలం అమలు
గతంలో ప్రభుత్వం జిల్లా పరిషత్ పాఠశాలల్లో బాలికలకు కరాటేలో శిక్షణ ఇప్పించింది. అయితే ఎంపిక చేసిన 75 జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల్లో మాత్రమే అమలు చేసింది. 2012 నుంచి ఏప్రిల్ 2013 వరకు రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం) కింద కరాటే శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వమే కరాటే దుస్తులు సరఫరా చేసింది. ప్రైవేటుగా కరాటేలో నిష్ణాతులైన మాస్టర్‌లను శిక్షకులుగా నియమించింది. మండలానికి ఒకరు చొప్పున నియామకం చేసింది. రోజు ఒక పాఠశాలలో కరాటే శిక్షణ ఇచ్చారు. ప్రతినెలా వారికి రూ.4 వేలు గౌరవ వేతనం ఇచ్చేవారు. అనంతరం గత ఏప్రిల్ మాసంలో కరాటే శిక్షకులను ప్రభుత్వం తొలగించింది. మళ్లీ వారిని విధుల్లోకి తీసుకోలేదు.
 
కరాటేతో లాభాలు..
ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్లిన మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రోజు బాలికలు, యువతులపై లైంగికదాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. పాఠశాలకు వెళ్లే బాలికలకు, కళాశాలకు వెళ్లే విద్యార్థినులకు, ఉద్యోగానికి వెళ్లే మహిళలు ధైర్యంగా కాలు బయట పెట్టలేని దుస్థితి. ఈ క్రమంలో పాఠశాల స్థాయి నుంచి బాలికలకు కరాటేలో శిక్షణ ఇస్తే వారిలో ఆత్మస్థైర్యం పెరిగే అవకాశం ఉంది. తమకు తాము రక్షించుకోవచ్చనే ధైర్యం ఏర్పడుతుంది. ఇంకా కరాటే సాధనతో ఆరోగ్యంతోపాటు, ఆత్మరక్షణ , జ్ఞాపకశక్తి, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలననే ధైర్యం వస్తుంది. యోగాలో కూడా తర్ఫీదు ఇవ్వడంతో శరీరానికి అలసటనేది ఉండదు. చురుకుగా ఉంటారు. చదువులో కూడా రాణిస్తారు.
 

మరిన్ని వార్తలు