‘కల్తీ’ కిక్కు!

25 Dec, 2019 13:02 IST|Sakshi
కృష్ణగిరి మండలం అమకతాడులో స్వాధీనం చేసుకున్న నకిలీ మద్యం బాటిళ్లు (ఫైల్‌)

జోరుగా నకిలీ, కల్తీ మద్యం విక్రయాలు

సరిహద్దు దాటి వస్తోన్న కర్ణాటక మద్యం

తెలంగాణ నుంచి కూడా దిగుమతి

సరిహద్దు ప్రాంతాల్లోనే ఎక్కువగా విక్రయం

కృష్ణగిరి మండలం అమకతాడులో ఈ నెల 10న నకిలీ మద్యం విక్రయిస్తున్న ముగ్గురిని స్టేట్‌ ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అరెస్టు చేశారు. వీరు         కర్ణాటకలోని ధార్వాడ్‌ జిల్లా హల్వహో గ్రామానికి చెందిన వినోద్‌ కలార్‌ అనే వ్యక్తి ద్వారా స్పిరిట్, మత్తు ద్రావణాలు కొనుగోలు చేసి కర్నూలు        కృష్ణానగర్‌లో నకిలీ మద్యం తయారు చేశారు. ఇది వెలుగులోకి వచ్చిన ఉదంతం. నిజానికి కల్తీ, నకిలీ మద్యం విక్రయాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. బెల్టుషాపులు రద్దు చేయడం, ప్రభుత్వ ఆధీనంలో మద్యం దుకాణాలు నడుస్తుండటంతో అక్రమ వ్యాపారానికి బ్రేక్‌ పడినట్లయ్యింది. దీంతో గతంలో మద్యం విక్రయించిన వారంతా కర్ణాటక, తెలంగాణ మద్యంతో పాటు కల్తీ, నకిలీ మద్యాన్ని కూడా తయారు చేస్తున్నారు. వీటిని ఎక్కువగా గ్రామాల్లో బెల్టుషాపుల తరహాలో విక్రయిస్తున్నారు.  

సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాకు సరిహద్దు ప్రాంతంగా కర్ణాటక ఉంది. దీంతో మంత్రాలయం, ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లోని సరిహద్దు గ్రామాల మీదుగా జిల్లాలోకి కర్ణాటక మద్యం చేరుతోంది. నిత్యం ఏదో ఒక చోట వందల కేసుల మద్యం పట్టుబడుతోంది. మరోవైపు తెలంగాణ సైతం సరిహద్దు రాష్ట్రం కావడంతో అక్కడి నుంచి కూడా మద్యం వస్తోంది. ఈ వ్యవహారమంతా       ఎక్సైజ్‌ అధికారులకు తెలుసు. కొందరు       ఎక్సైజ్‌ సీఐలు, ఎస్‌ఐలు ఆయా ప్రాంతాల్లో కర్ణాటక మద్యం విక్రయిస్తున్న వారి వద్దకు వెళ్లి మామూళ్లు తీసుకుని, చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలంఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినప్పుడు మాత్రమే తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. సివిల్‌ పోలీసులు సైతం ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారు.

కర్ణాటక లిక్కర్‌తో భారీ లాభాలు
మన రాష్ట్రంలోని మద్యం ఈఎన్‌ఏ (ఎక్స్‌ట్రా నూట్రల్‌ ఆల్కహాల్‌) బేస్‌డ్‌గా తయారవుతోంది. కర్ణాటకలో ఆర్‌ఎస్‌ (రెక్టిఫై స్పిరిట్‌) బేస్‌డ్‌ మద్యం తయారవుతోంది. ఈఎన్‌ఏ లిక్కర్‌ డబుల్‌ఫిల్టర్, ఆర్‌ఎస్‌ సింగిల్‌ ఫిల్టర్‌. ఈఎన్‌ఏ స్పిరిట్‌ లీటర్‌ రూ.50–55 ఉండగా.. ఆర్‌ఎస్‌ స్పిరిట్‌ కేవలం రూ.28–30కే లభిస్తోంది. దీంతో ఆర్‌ఎస్‌ మద్యం తయారీకి తక్కువ ఖర్చు అవుతుంది. దీంతో కర్ణాటక మద్యం ఆంధ్రా కంటే తక్కువ ధరకు లభిస్తోంది. ఛీప్‌ లిక్కర్‌ 180 ఎంఎల్‌ క్వార్టరు బాటిళ్లు ఒక్కో కేసులో 48 ఉంటాయి. ఒక క్వార్టర్‌ బాటిల్‌ మద్యం విలువ మార్కెట్‌లో రూ.60. ఛీప్‌ కంటే కొంచెం మెరుగ్గా ఉండే డిప్‌ (90 ఎంఎల్‌ బాటిల్‌)లు ఒక్కో కేసులో 96 ఉంటాయి. ఒక్కో డిప్‌ విలువ రూ.45.  కర్ణాటకకు చెందిన ఛీప్, మధ్యస్థ రకాల మద్యం జిల్లాలోకి వస్తోంది. తుంగభద్ర నదికి అటువైపు కర్ణాటక, ఇటు వైపు కర్నూలు జిల్లా ప్రాంతాలు ఉన్నాయి. దీంతో కర్ణాటకకు వెళ్లి మద్యం కొనుగోలు చేసి..తీసుకొస్తున్నారు. 

మూడో రకంతో ముప్పు
బేవరేజెస్‌ నుంచి తెచ్చుకునేది మొదటి రకందీన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తారు. కర్ణాటకలో కొనుగోలు చేసి విక్రయించే సరుకు రెండో రకం. దీన్ని ‘సెకండ్స్‌’అంటారు. అసలు ఎలాంటి ఎక్సైజ్‌ డ్యూటీ చెల్లించకుండా స్పిరిట్, అవసరమైన పదార్థాలతో సొంతంగాతయారు చేసి విక్రయించేది మూడో రకం మద్యం. ప్రస్తుతం ఇలాంటి మద్యం అమ్మకాలు కూడా కర్నూలులో మొదలయ్యాయి. కర్ణాటక నుంచి తెచ్చిన మద్యాన్ని బేసిన్లు, టబ్‌లలో పోసి.. నీళ్లు, రంగు, స్పిరిట్‌ కలుపుతారు. దీంతో పాటు మత్తు కల్గించేందుకు ఇతర ద్రావణాలు, కొందరు ‘కోరెక్స్‌’ సిరప్‌ను కూడా కలిపి కల్తీమద్యం తయారు చేస్తున్నారు. వీటిని సీసాల్లో నింపి.. మూత తొడిగి పట్టకారుతో నొక్కితే సహజ మూతలాగా అతుక్కుపోతుంది. దీనికి పలు ఛీప్‌ లిక్కర్‌ బ్రాండ్లకు సంబంధించిన నకిలీ స్టిక్కర్లు అతికించి..విక్రయిస్తున్నారు.

రోజూ కేసులు నమోదు చేస్తున్నాం
కర్ణాటక, తెలంగాణ నుంచి మద్యం వస్తోంది. పత్తికొండ, కోసిగి, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల్లో ఎక్కువగా వస్తోంది. ఇటీవల మంచి కేసులు పట్టాం. తెలంగాణలో ఈ నెల 20 నుంచి మద్యం ధరలు పెరిగాయి. దీంతో అక్కడి నుంచి తగ్గింది. కర్ణాటక నుంచి వస్తోంది. ఆరు చెక్‌పోస్టులను బలోపేతం చేశాం. తుంగభద్ర మీదుగా పుట్టిల ద్వారా మద్యం తెస్తున్నారు. రాత్రిళ్లు కూడా పెట్రోలింగ్‌ చేస్తున్నాం. కేసు నమోదు కాని రోజే లేదు. రాష్ట్రంలో ఎక్కువ కేసులు కర్నూలు జిల్లాలోనే నమోదయ్యాయి.– చెన్నకేశవరావు, డీసీ, ఎక్సైజ్‌శాఖ 

మరిన్ని వార్తలు