వైభవంగా ధ్వజారోహణం.. ఆకర్షిస్తోన్న సైకత శిల్పం

13 Sep, 2018 19:11 IST|Sakshi

సాక్షి, తిరుమల : ఈ ఏడాది రెండు పర్వదినాలు ఒకే రోజున వచ్చాయి. వాటిలో విఘ్నాల్ని తొలగించి, విజయాల్ని అనుగ్రహించే దైవం వినాయకుని పుట్టినరోజు ఒకటి కాగా.. మరోటి ముక్కోటి దేవతలు, ముల్లోకాలు ఎంతో ఆత్రంగా ఎదురుచూసే బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు కూడా ఈ రోజే ప్రారంభమయ్యాయి. బ్రహ్మాత్సావాల్లో భాగంగా ఈ ఏడాది తొలి పూజలు గణనాథుడే అందుకున్నాడు. ఏటా ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది అధికమాసం కావడంతో రెండు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. తొలి ఉత్సవాలు నేడు ప్రారంభమవుతుండగా.. 20 రోజుల తేడాతో శరన్నవరాత్రి సందర్భంగా మరోసారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

ప్రస్తుతం నిర్వహించే సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5 - 6. 30 గంటల ప్రాంతంలో మకర లగ్నంలో ధ్వజరోహణ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఇందులో భాగంగా ధ్వజ స్తంభంపై జెండాను ఎగురవేసి సకల దేవతలకు ఆహ్వానం పలకుతారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు స్వామీవారు పెదశేష వాహనంపై ఊరేగుతారు.

భక్తులను ఆకర్షిస్తోన్న సైకత శిల్పం
బ్రహ్మోత్సవాల సందర్భంగా విష్ణుమూర్తి దశవతారాలలోని ఒక్కో అవతారాన్ని ఏడాదికి ఒకటి చోప్పున  సైకత శిల్పంగా రూపొందించి ఉత్సవాలకు అదనపు హంగులు అద్దుతున్నారు మైసూర్‌కు చెందిన ఇద్దరు అక్కచెళ్లల్లు. వారి వివరాలు.. కర్ణాటకకు చెందిన  నీలాంభిక తన సోదరి గౌరితో కలిసి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ సైకత శిల్పాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. గత ఏడేళ్ల నుంచి  పాప నాశనం వెళ్లే దారిలో ఫలపుష్ప ప్రదర్శన శాలలో ఈ సైకత శిల్పాలను రూపొందిస్తున్నారు. టీటీడీ గార్డెన్‌ ఇన్‌చార్జ్‌ శ్రీనివాస్‌ సహకారంతో ఈ శిల్పాలను తయారు చేస్తున్నట్లు నీలాంభిక తెలిపారు. మూడు రోజులపాటు శ్రమించి ఈ సైకత శిల్పాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికవరకూ వరాహ, ఉగ్ర నరసింహ, మత్స్య అవతారాలను సైకత శిల్పంగా చెక్కినట్లు తెలిపారు. ఈ ఏడాది వామన అవతారాన్ని రూపొందించామన్నారు. ఇందుకుగాను 9 టన్నుల ఇసుకను వాడినట్లు తెలిపారు.

దేశం మొత్తం మీద ఇద్దరే...
దేశంలో సైకత శిల్పాలను రూపొందిస్తున్న మహిళా కళాకారులు వీరిద్దరు మాత్రమే ఉండటం గమనార్హం. వీరు మన దేశంలోనే కాక అరబ్‌ దేశంలో కూడా సైకత శిల్పాలాను రూపొందించినట్లు తెలిపారు. అరబ్‌ దేశంలో నిర్వహించే ఒంటేల పండుగ సందర్భంగా అరబ్‌ దేశాల సంస్కృతిని ప్రతిబింబించేలా సైకత శిల్పాలను రూపొందించినట్లు నీలాంభిక తెలిపారు. ఈ కళను నేర్చుకోవడం కోసం తాము ఎవరి దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదని.. ఇంటర్‌నెట్‌లో చూసి ఈ సైకత శిల్పాలలను మలచడం నేర్చుకున్నట్లు నీలాంభిక తెలిపారు.

మరిన్ని వార్తలు