దివ్యవాహినికి..దివ్వెల నీరాజనం

7 Nov, 2014 00:36 IST|Sakshi
దివ్యవాహినికి..దివ్వెల నీరాజనం

 నీటి నుంచి వెలుగుల సృష్టి.. విద్యుదుత్పత్తితో మాత్రమే కాదు.. ఆ నీరే నేరుగా పొలాల్లోకి చేరి, పంటలకు జీవమై, జీవనంలో సౌభాగ్యం నింపడం వల్ల కూడా జరుగుతుంది.తరతరాలుగా గోదారమ్మ ఈ సీమ జీవితంలో సిరుల కాంతిని ప్రసరిస్తోంది. మరి,ఆ తల్లి రుణం ‘కిరణమంతైనా’ తీర్చుకోవాలని శ్రీకారం చుట్టిందే పున్నమిహారతి.నింగిలో వెలుగుతున్న కార్తిక పున్నమి జాబిలితో పాటు గురువారం రాత్రి పుష్కరాలరేవులో వెలిగిన జ్యోతులూ ప్రతిఫలించగా గోదావరి దివ్యధామంగా భాసిల్లింది.
 
 సాక్షి, రాజమండ్రి :తరతరాలుగా ఇహానికి సిరులను ప్రసాదిస్తూ, పరానికి వారధిగా నిలుస్తున్న పావన గోదావరికి .. పున్నమి రాతిరి హారతి ఇచ్చే అపురూపమైన వేడుకకు జనం వేలాదిగా పోటెత్తారు. అసలే.. నిండుజాబిలి వెండి వెలుగులు అలలకు బంగారు లేపనాన్ని వేసినట్టు మెరిపించగా.. ఆ పై రేవు నుంచి ఇచ్చే హారతి కాంతులు అదనపు నగిషీలుగా జిలుగులద్దాయి. కార్తిక పౌర్ణమి పర్వదినాన బుద్ధవరపు చారిటబుల్ ట్రస్టు నిర్వహించిన పున్నమి హారతి ఉత్సవం సందర్భంగా రాజమండ్రి పుష్కరాలరేవు ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. వచ్చే ఏడు రావలసిన పుష్కరాలు ఇప్పుడే వచ్చాయా అనిపించేంతగా రేవు కిటకిటలాడింది. గోదావరి ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని చాటి చెప్పడంతో పాటు  గంగానదికి వారణాసిలో ఇస్తున్న విధంగానే గోదారమ్మకు కూడా హారతులివ్వాలనే సంకల్పంతో ప్రతినెలా పున్నమికి హారతి ఇచ్చే కార్యక్రమానికి ట్రస్టు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గురువారం కార్తిక పౌర్ణమి సందర్భంగా 50వ హారతి కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. గోదావరి మాత ఘనతను చాటి చెపుతూ, హారతుల వైశిష్ట్యాన్ని వివరిస్తూ వేదపండితులు ఈ క్రతువును నిర్వర్తించారు.
 
 ఉట్టిపడిన భక్తిభావం
 పుష్కరాలరేవు వద్ద గోదావరిలో పంటుపై ప్రత్యేకంగా నిర్మిం చిన వేదికపై సాయంత్రం 6.00 గంటలకు హిందూ సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 7.15 గంటలకు శ్రీరామదూత స్వామి నిర్వహించిన ప్రత్యేక పూజలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం అయిదుగురు ప్రముఖులకు గోదావరి పురస్కారాలను అందజేశారు. పలువురు ప్రముఖులను సత్కరించారు. 8.30 గంటలకు ప్రముఖుల ప్రసంగాలు పూర్తయిన అనంతరం గోదారమ్మకు హారతులిచ్చారు. వైదిక సాంప్రదాయం ప్రకారం షోడశోపచారాలతో, వేదమంత్రోచ్ఛారణల ఈ కార్యక్రమం భక్తిభావపూరితంగా జరిగింది.
 
 ‘స్వచ్ఛ గోదావరి’కి సంకల్పం
 కేవలం గోదావరి హారతి కార్యక్రమంతో ఆధ్యాత్మిక చింతనను ఉద్దీప్తం చేయడమే కాక నది పవిత్రతను కూడా కాపాడుకోవాలనే సందేశాన్నిచ్చేందుకు ఈసారి ‘స్వచ్ఛ గోదావరి’ అనే కార్యక్రమానికి కూడా ట్రస్టు శ్రీకారం చుట్టింది. గురువారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ గోదావరి పరిరక్షణ, కాలుష్య నివారణ అంశాలపై కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా విద్యార్థులతో గోదావరి పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించిన అనంతరం 10.00 గంటలకు గోదావరి అందాలను, చారిత్రక ప్రాధాన్యాన్ని, ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని చాటే ఫొటో ఎగ్జిబిషన్‌ను దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రారంభించారు. ‘స్వచ్ఛ గోదావరి’ అనే అంశంపై చర్చా కార్యక్రమం చేపట్టారు. గురువారం నాటి పున్నమి హారతి గోదావరి పరిరక్షణ దిశగా వేస్తున్న కీలక అడుగుగా బుద్ధవరపు ట్రస్టు పేర్కొంటోంది. కాలుష్యాన్ని నివారించడం కూడా గోదావరి మాతను ఆరాధించడంతోనే సమానమనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 50వ హారతి కార్యక్రమాన్ని వేదికగా చేసుకుంది. పాపికొండల నుంచి అంతర్వేది వరకూ గోదావరిలో ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రజలు స్వచ్ఛందంగా అమలు చేసేలా బృహత్తర కార్యక్రమాన్ని తలకెత్తుకున్నట్టు ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు బి.ఎస్.ఎన్.కుమార్ పేర్కొన్నారు. ఈ దిశగానే ఈ పున్నమి హారతిని మరింత విలక్షణంగా నిర్వహించామన్నారు.
 

>
మరిన్ని వార్తలు