కాశీ నుంచి ఎట్టకేలకు ఇంటికి..

27 Apr, 2020 08:30 IST|Sakshi

సాక్షి, రాయవరం: కాశీయాత్రకు వెళ్లిన భక్తులు లాక్‌డౌన్‌లో చిక్కుకుని, 41 రోజుల అనంతరం ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేవు. మార్చి 16న రాయవరం మండలం సోమేశ్వరం నుంచి బండి మురళీకృష్ణ, రామలక్ష్మి, సబ్బెళ్ల శ్రీనివాసరెడ్డి, సూర్యకుమారి, నున్న పాపయ్యమ్మ, శాకా రామలింగేశ్వరరావు; అనపర్తి మండలం కుతుకులూరు నుంచి సత్తి శ్రీనివాసరెడ్డి, సత్తి సత్యతో పాటు ద్రాక్షారామ, రావులపాలెం తదితర గ్రామాల నుంచి 27 మంది కాశీ యాత్రకు వెళ్లారు. గత నెల 24 నుంచి లాక్‌డౌన్‌ అమలు కావడంతో వీరందరూ అక్కడే చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతితో ఈ నెల 14న సొంత ఖర్చులతో వాహనం ఏర్పాటు చేసుకున్నారు.

జిల్లాకు చెందిన 27 మంది, విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన ముగ్గురు కలిసి మొత్తం 30 మంది ఒకే వాహనంపై ఈ నెల 16న కృష్ణా జిల్లా నందిగామ చేరుకున్నారు. అక్కడ రెండు రోజుల క్వారంటైన్‌ అనంతరం జిల్లాలోని అన్నవరంలోని క్వారంటైన్‌ సెంటర్‌కు వారిని తరలించారు. అక్కడి నుంచి వారిని అధికారులు ఆదివారం ప్రత్యేక వాహనంలో స్వస్థలాలకు తరలించారు. వీరందరూ ఆయా మండలాల తహసీల్దార్‌ కార్యాలయాలకు చేరుకోగా, వారిని వారి నివాసాలకు వెళ్లేందుకు అనుమతించారు. మరో 14 రోజులు ఇళ్ల వద్దే క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. కాశీ నుంచి హైదరాబాద్‌ బాగానే వచ్చామని, అక్కడి నుంచి రాష్ట్రానికి వచ్చే మార్గంలో ఆహారం, తాగునీరు లభించక తీవ్ర ఇబ్బందులు పడ్డామని బండి మురళి తెలిపారు.

17 మంది కాశీ యాత్రికుల రాక
పెదపూడి: జి.మామిడాడ, రామేశ్వరం గ్రామాల నుంచి కాశీ యాత్రకు వెళ్లిన 17 మంది ఆదివారం స్వగ్రామాలకు చేరుకున్నారని తహసీల్దార్‌ కె.రాజ్యలక్ష్మి తెలిపారు. వారిని హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచుతున్నామని, వారి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. 

మరిన్ని వార్తలు