పీఎఫ్.. ఉఫ్

20 Jan, 2014 04:36 IST|Sakshi

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇటీవలకాలం వరకు పనిచేసిన అకౌంటెంట్లకు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ శఠగోపం పెట్టింది. పీఎఫ్ చెల్లించకుండా నానా తిప్పలు పెడుతోంది. ఇప్పటికీ పనిచేస్తున్న ఇతర సిబ్బందికి పీఎఫ్ జమ చేస్తున్న దాఖలాలు లేవు. ఆర్వీఎం ఉన్నతాధికారుల అండదండలు ఉండడంతో ఆ ఏజెన్సీ నిర్వాహకులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఈ ఏజెన్సీ.. రాజీవ్ విద్యా మిషన్ (ఆర్వీఎం)లో అవుట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేసి రెండు రోజుల క్రితం తొలగింపునకు గురైన వ్యక్తిదే కావడం గమనార్హం.
 
 సాక్షి, నల్లగొండ: జిల్లాలో ఆర్వీఎం పరిధిలో 18 కేజీబీవీలు ఉన్నాయి. ఈ విద్యాలయాలకు కావాల్సిన అకౌంటెంట్లు, ఏఎన్‌ఎం, స్వీపర్, నైట్ వాచ్‌మన్‌లను గత పీఓకు కావాల్సిన వ్యక్తికి చెందిన అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ సమకూర్చింది. వీరంతా 2011 జూన్‌లో నియామకమయ్యారు. అప్పటి నుంచి ఒక్కొక్కరి వేతనంలో పీఎఫ్ కింద 13.61 శాతం, ఈఎస్‌ఐ కింద 4.75 శాతం, ఇతరత్రాలను కలిపి  కట్ చేశారు. రూ.1600 చొప్పున 72 మంది వేతనాల్లో ప్రతినెలా రూ.1.30 లక్షలు కోత విధించారు. కట్ చేసిన పీఎఫ్ మొత్తాన్ని సంబంధిత ఉద్యోగి/సిబ్బంది ఖాతాల్లో విధిగా జమ చేయాలి. కానీ ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు. అంతేగాక ెహ ల్త్‌కార్డు కూడా అందజేసిన దాఖలా ఒక్కటీ లేదు.
 
 రూ.15 లక్షలకుపైగా....
 కేజీబీవీల్లో పనిచేస్తున్న 17మంది అకౌంటెంట్లను అనర్హత కారణంగా గతేడాది ఆగస్టులో విధుల నుంచి ఆర్వీఎం అధికారులు తొలగించారు. తమకు పీఎఫ్ అందజేయాలని సదరు అభ్యర్థులు ఆర్వీఎం అధికారులు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అయినా వారిలో చలనం లేకపోయింది. దీంతో గత్యంతరం లేక వారు సీఎం కార్యాలయంలో గత నవంబర్ నెలాఖరులో ఫిర్యాదు చేశారు.
 
 దీనిపై విచారణ చేపట్టాలని అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆదేశాలు అందాయని సమాచారం. పీఎఫ్ అందజేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్వీఎంకు సూచనలు అందాయి. అయితే సదరు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ తన అనుయాయుడు కావడంతో ఆర్వీఎం ఉన్నతాధికారి చేష్టలుడిగారు. పెద్దాయన ఆశీస్సులు తమకుండగా... నాకేంటి అన్న ధీమాలో ఉన్నాడు. విధుల్లో చేరినప్పటి నుంచి 72 మందికి చెందిన దాదాపు రూ.15 లక్షల పీఎఫ్ అందజేయాల్సి ఉంది. ఆర్వీఎంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న ఈయన రెండు రోజుల క్రితం విధుల నుంచి తొలగింపునకు గురైన విషయం తెలిసిందే. దీంతో తమకు పీఎఫ్ వస్తుందో రాదోనన్న భయాందోళనలో ఉద్యోగులు ఉన్నారు. ఈ విషయంపై కలెక్టర్ దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు