ఆగడాలకు అంతం పలకండి

6 Nov, 2017 09:37 IST|Sakshi
మాచవరం మండలం మోర్జంపాడు నుంచి ర్యాలీగా వస్తున్న మహిళలు ,ఎస్‌ఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహేష్‌రెడ్డి

మాచవరం మండలంలో టీడీపీ నేతల అరాచకాలు

అడిగిన వారిపై అక్రమ కేసుల బనాయింపు

500 మంది మహిళల రాస్తారోకో

మద్దతుగా నిలిచిన వైఎస్సార్‌ సీపీ నేత కాసు మహేష్‌ రెడ్డి

అభిమానంతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొంటే నిర్దాక్షిణ్యంగా పీకేశారు. ఇంటి ముందు ముగ్గులేసుకొంటే పసుపు నీళ్లు చల్లి అవమానించారు. ఇదేమి రౌడీయిజమని ప్రశ్నిస్తే పోలీసుల అండతో అక్రమ కేసులు బనాయించారు. ఇలా రోజురోజుకు పెరిగిపోతున్న టీడీపీ నాయకుల ఆగడాలపై మాచవరం మండలంలోని మహిళలు తిరగబడ్డారు. సుమారు 500 మంది వరకు పిడుగురాళ్లలో పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించి పోలీసులు, టీడీపీ నాయకుల తీరును దుయ్యబట్టారు. వీరికి వైఎస్సార్‌ సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌ రెడ్డి మద్దతు పలికారు

పిడుగురాళ్ల టౌన్‌: పల్నాడు ప్రాంతంలోని మాచవరం మండలంలో టీడీపీ నేతల అరాచకాలు అధికమయ్యాయి. వీరికి పోలీసులు వంతపలకడంతో వారి దుర్మార్గాలకు అంతులేకుండా పోయింది. ఇదేమని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తూ స్టేషన్‌లో వేయిస్తున్నారు. అధికారం మాది, అధికారులూ మా వాళ్లే అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. చివరకు మహిళలనూ పరుష పదజాలంలో దుర్భాషలాడుతున్నారు. పండుగ సమయాల్లో ముగ్గులు వేస్తే వాటిపై పసుపు రంగు చల్లి అవహేళన చేస్తున్నారు. ఇంటి ముందు అభిమానంతో ప్లెక్సీలు ఏర్పాటు చేస్తే తొలగించాలని ఆదేశిస్తున్నారు. లేదంటే నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తున్నారు. వీరి దౌర్జన్యాలు, ఆగడాలను భరించలేక మండలంలోని మోర్జంపాడు గ్రామ మహిళలు వందలాదిగా ఏకమై పిడుగురాళ్ల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట అద్దంకి–నార్కెట్‌పల్లి రహదారిపై ఆదివారం బైఠాయించి నిరసన తెలిపారు. వీరికి వైఎస్సార్‌ సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి మద్దతుగా నిలిచారు.

మాచవరం మండలంలోని మోర్జంపాడు వైఎస్సార్‌ సీపీకి పట్టున్న గ్రామం. ఇది తట్టుకోలేని టీడీపీ నాయకుడు జీవీఆర్, మరో ఇద్దరు గత కొన్ని నెలలుగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు, అభిమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన మహిళలు పిడుగురాళ్ల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట రాస్తారోకో చేశారు. టీడీపీ నాయకులపై చర్యలు తీసుకునేంత వరకు రాస్తారోకో విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గ్రామంలో రాత్రి పూట బయటకూర్చొనే పరిస్థితి లేదని, మద్యం సేవించి సీసాలను ఇళ్లల్లో వేస్తున్నారని తెలిపారు. బాంబులు విసరడం లాంటి కవ్వింపు చర్యలకూ పాల్పడుతున్నారు.

దాడి చేసి మాపైనే కేసులు: మహిళలు
అరాచకాలపై ప్రశ్నిస్తే టీడీపీ నాయకుడు ఒకరు తమను కొట్టి తిరిగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారన్నారు. ‘బాస్‌ చెప్పారు. వాళ్లని లోపల వేసి కొట్టండి’ అని హుకుం జారీ చేయడంతో ఎస్‌ఐ కూడా జీ హుజూర్‌ అంటూ వైఎస్సార్‌ సీపీ వాళ్లపై కేసులు నమోదు చేస్తున్నారని మహిళలు వాపోయారు. అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారంటూ అవేదన వ్యక్తం చేశారు. ఇటీవల 200 వందల మంది మాచవరం పోలీస్‌స్టేషన్‌ వద్ద ధర్నాచే స్తే ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. తమ ఇళ్లకు టీడీపీ రంగులు వేయటం, బ్యానర్లు పీకేయడం ఇలా ఎన్నో రకాలుగా పోలీసులను అడ్డుపెట్టుకుని జీవీఆర్‌ అనే నాయకుడు మండలంలో అరాచకాలు సృష్టిస్తున్నారని తెలిపారు. అతని అరాచకాలను ఆపాలని రూరల్‌ సీఐ సుబ్బారావు వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. మహిళలనూ దుర్భాషలాడి వేధించడంతో తమ దగ్గరకు వచ్చామని సీఐకు వివరించారు.

మహిళల ఆవేదనపై ఎస్‌ఐ వెటకారం
పోలీస్‌స్టేషన్‌లోకి కాసు మహేష్‌రెడ్డితోపాటు మహిళలను పంపించాలని మాచవరం ఎస్‌ఐ జగదీష్‌ను సీఐ ఆదేశించారు. ఎస్‌ఐ మహిళలతో మాట్లాడుతూ అక్కడ వారు పసుపు నీళ్లు చల్లారని ఇక్కడ రోడ్లపై రంగులు చల్లుతారా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. పక్కనే ఉన్న మహేష్‌రెడ్డి ఆగ్రహించి ‘మాచవరం మండలంలో అధికార పార్టీ వారితో రంగులు చల్లిస్తున్నావు కదా ఇక చాల్లే’ అంటూ మండిపడ్డారు. అతని ప్రవర్తనపై మహేష్‌ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా ఎస్‌ఐ జగదీష్‌లో మార్పు రాలేదంటూ మహిళలు మండిపడ్డారు. అధికారుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

న్యాయం చేయకపోతే వెయ్యి మందితో ధర్నా చేస్తాం: కాసు మహేష్‌ రెడ్డి
మహిళలకు మద్దతు పలికిన కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అరాచకాలు అధికమయ్యాయని, పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌ సీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ‘భయపడితే భయపడం.. ఇప్పుడు న్యాయం జరుగుతుందని 500 మందితో వచ్చాం.. పోలీసులు న్యాయం చేయకపోతే 1000 మందితో గుంటూరులో ధర్నా చేపడతామ’ని హెచ్చరించారు. ఆయన వెంట జెడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి, పట్టణ, మండల నాయకులు, వందలాది మంది కార్యకర్తలు ఉన్నారు.

మరిన్ని వార్తలు