టీడీపీ పాలనలో మహిళలకు భద్రత కరువు

9 Mar, 2016 03:09 IST|Sakshi
టీడీపీ పాలనలో మహిళలకు భద్రత కరువు

అధికార పార్టీ తీరుపై మండిపడ్డ కత్తెర హెనీ క్రిస్టీనా
ఫిరంగిపురం : టీడీపీ పాలనలో మహిళలకు భద్రత కరువైందని వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కత్తెర హెనీ క్రిస్టీనా విమర్శించారు. ఆమె మంగళవారం  ఫిరంగిపురంలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్న అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మహిళా దినోత్సవాన్ని నిర్వహించే అర్హత అధికార పార్టీ నాయకులకు లేదన్నారు. చంద్రబాబుకు మొదటి నుంచి మహిళలపై సదభిప్రాయం లేదని విమర్శించారు. ఇందుకు ఇటీవల జరిగిన పలు ఘటనలే నిదర్శనమని తెలిపారు. తహశీల్దారు వనజాక్షిని దెందులూరు ఎమ్మెల్యే కొట్టి హింసిస్తే అతనిపై చర్యలు తీసుకోలేదన్నారు.

జీతాలు పెంచాలని కోరుతూ విజయవాడలో ధర్నాకు దిగిన అంగన్‌వాడీలను పోలీసులతో తీవ్రంగా కొట్టించిన ఘనత చంద్రబాబుది కాదా అని ప్రశ్నించారు. విద్యార్థిని రిషితేశ్వరి మృతి ఘటనలో సైతం నిందితులను అరెస్ట్ చేసేందుకు మీనమేషాలు లెక్కించారని మండిపడ్డారు. మంత్రి రావెల కుమారుడు సుశీల్ నిస్సిగ్గుగా ఉపాధ్యాయురాలితో వ్యవహరించిన తీరు మరో ఉదాహరణ అన్నారు. కోడలు మగ పిల్లాడిని కంటే అత్త వద్దంటుందా? అని ఢిల్లీలో వ్యాఖ్యానించిన చంద్రబాబుకు మహిళలపై ఉన్న వైఖరిని అర్థం చేసుకోవచ్చన్నారు.

హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణకు కూడా మహిళలపై సదభిప్రాయం లేదన్నారు. ఓ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో మహిళలను చులకన చేస్తూ అసభ్యకరంగా మాట్లాడటం విచారకరమన్నారు. ఇన్ని తప్పులు చేస్తూ ప్రతి దానికి జగన్‌ను బాధ్యుడిని చేయాలని అధికార పార్టీ నాయకులు, మంత్రులు చూస్తున్నారని విమర్శించారు. మానసిక స్థితి సక్రమంగా లేని రావెలకు వెంటనే చికిత్స అందించాలని ఆమె హితవు పలికారు.

మరిన్ని వార్తలు