నా కొడుకుని కాదు అతడ్ని బహిష్కరించండి: కత్తి మహేష్‌ తండ్రి

9 Jul, 2018 21:09 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై ఈ రోజు(సోమవారం) హైదరాబాద్‌ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. కత్తి ఇటీవల శ్రీరాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో.. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, హిందూమతాన్ని కించపరిచేవిధంగా ఆయన మాట్లాడారని హిందూ మతపెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా కత్తి మహేశ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ.. స్వామి పరిపూర్ణానంద తలపెట్టిన ధర్మాగ్రహ యాత్రకు పోలీసులు బ్రేక్‌ వేసిన సంగతి తెలిసిందే. శ్రీరాముడిపై వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికే కత్తిపై పలు కేసులు నమోదయ్యాయి.

దీనిపై కత్తి మహేష్‌ తండ్రి కత్తి ఓబులేసు స్పందించి శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నా కొడుకును కాదు.. హిందువులను రెచ్చగొడుతున్న పరిపూర్ణానందను దేశ బహిష్కరణ చేయాలన్నారు. మహేష్ దళితుడు కాబట్టే బ్రాహ్మణులు అనవసర రార్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాముడి గురించి నా కొడుకు మాట్లాడింది నూటికి నూరు శాతం నిజమేనని పేర్కొన్నారు. రామాయణం విష వృక్ష పుస్తకం.. పూర్తిగా చదివితే రాముడు ఎలాంటి వాడో అందరికీ అర్థమవుతోందన్నారు. 

నా కొడుకు హిందువే.. నాస్తికుడు కాదు.. అస్తికుడేనని తెలిపారు. నా కొడుకు తన భార్యతో కలిసే ఉన్నాడు విడిపోలేదని చెప్పారు. ఈ నెల 4న లక్నో వెళ్లి కుమారుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారని తెలిపారు. సామాజిక మాథ్యమాల్లో కావాలనే కొంతమంది నా కొడుకుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. 

మరిన్ని వార్తలు