చంద్రబాబు దళిత ద్రోహి: కత్తి పద్మారావు

14 Jul, 2014 08:17 IST|Sakshi
చంద్రబాబు దళిత ద్రోహి: కత్తి పద్మారావు

విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం దళిత ద్రోహానికి పాల్పడుతూ వారి హక్కులను కాలరాస్తోందని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు 32 శాతం ఉండగా కేవలం చంద్రబాబు ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులు కట్టబెట్టి దళిత వ్యతిరేక స్వభావాన్ని చాటుకున్నారన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది.

అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దళిత మహాసభ తీర్మానాలను పద్మారావు వెల్లడించారు. వ్యవసాయ రంగంతో అనుసంధానం చేసి ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. సబ్‌ప్లాన్ నిధులు రూ. 16 వేల కోట్లు కాజేయాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోందని, అవసరమైతే దీనిపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. బి.ఆర్.అంబేద్కర్ 150 అడుగుల విగ్రహాన్ని నూతన రాష్ట్ర రాజధానిలో నిర్మించాలని తీర్మానించినట్లు చెప్పారు.

అంబేద్కర్, ఫూలే వంటివారి జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. చుండూరు కేసును దళిత మహాసభ సుప్రీంకోర్టులో సవాల్ చేసిందన్నారు. లక్ష్మింపేటలో మరణించిన ఆరుగురి విగ్రహాల ఏర్పాటు, చుండూరులో రక్త క్షేత్ర నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరుతూ తీర్మానించినట్లు చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 1న నూతన రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీకి పార్టీని సిద్ధం చేస్తామని ప్రకటించారు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

మరిన్ని వార్తలు