మిత్రుడి ప్రాణాలు రక్షించబోయి.. మృత్యు కౌగిలికి

12 Aug, 2015 02:16 IST|Sakshi

తాడేపల్లిగూడెం : పాఠశాలకు సెలవు దినం కావడంతో సరదాగా మిత్రులతో కలిసి కాలువలోకి స్నానానికి వెళ్లి, ప్రమాదవశాత్తు మునిగిపోతున్న మిత్రుని రక్షించే క్రమంలో అదే కాలువలో మునిగి విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన సంఘటన మంగళవారం తాడేపల్లిగూడెంలో జరిగింది. స్థానిక శివాలయం వీధిలో రామాలయం రేవు వద్ద నివాసం ఉంటున్న వర్మ తన ముగ్గురు మిత్రులతో కలిసి చిన్న బలుసులమ్మ ఆలయం వద్ద ఉన్న కాలువలో ఈత కొట్డడానికి దిగాడు. సరదాగా ఈత కొడుతుండగా ముగ్గురు మిత్రులలో ఒకరికి ఈత రాకపోవడంతో కాలువలో మునిగిపోతూ రక్షించమంటూ చేతులు పెకైత్తి కేకలు వేశాడు. మిత్రుడిని రక్షించేందుకు ఈత వచ్చిన వర్మ వెళ్లాడు. మిత్రుడిని రక్షించి గట్టు పైకి తీసుకువచ్చే క్రమంలో వర్మ మునిగిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
 
 వర్మ కాపాడిన మిత్రుడు, మిగిలిన ఇద్దరూ సంఘటనా స్థలం నుంచి ఉడాయించారు. కాలువలో వర్మ మునిగిపోయిన విషయం బయటకు రావడంతో అదే ప్రాంతానికి చెందిన 20 మంది యువకులు జట్టుగా శివాలయం దగ్గర నుంచి జువ్వలపాలెం కాలిబాట వంతెన వరకు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమాచారం తెలుసుకున్న అగ్నిమాపకదళాధికారి వి.సుబ్బారావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వర్మ మునిగిపోయిన ప్రాంతంగా చెబుతున్న ఏరియాలో సిబ్బంది వై.ఉమామహేశ్వరరావు, వి.భాస్కరరాజు ద్వారా యువకుల సాయంతో గాలించారు. అదే ప్రాంతంలో వర్మ దొరికాడు.
 
 అతనికి ప్రాణం ఉందని భావించిన యువకులు వర్మ సపర్యలు చేశారు. కొన వూపిరితో వర్మ ఉన్నట్టు భావించి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే వర్మ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సుమారు మూడు గంటలకు పైగా వర్మ కాలువలో ఉండిపోయి ఊపిరి అందక మరణించి ఉంటాడని చెబుతున్నారు. యువకులు మూడు గంటలకు గాలింపు చేపట్టి వర్మను రక్షించామని అనుకున్నారు. వర్మ తల్లితండ్రులు తమ బిడ్డకు జీవం ఉందనుకున్నారు. తీరా ఆసుపత్రికి వెళ్లాక వైద్యులు చెప్పిన విషయం విని వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
 
 చిన్నోడా వెళ్లిపోయావా..
 ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే పాలెపు నర్సింహమూర్తి, ధనావతి దంపతులకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో  చిన్న కుమారుడు ధనుంజయవర్మ (15) పట్టణంలోని ఒక ప్రయివేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ప్రత్యేక హోదా కోసం బంద్ పాటించడంతో పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఈ క్రమంలో మిత్రులతో కలిసి కాలువకు స్నానానికి వెళ్లాడు. మిత్రుడిని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయాడు. చిన్నోడా వెళ్లిపోయావా అంటూ అతని తల్లి ఆక్రందనలు చూపరులను కలిచివేశాయి.
 
 ఇదే కుటుంబంలో వర్మ సోదరునికి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాడు. ఇటీవలే అతను కోలుకున్నాడు. బిడ్డ బాగున్నాడని ఆ కుటుంబం సంతోషించే లోగా మరో బిడ్డ మృత్యువాతపడటం ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. 13 వ వార్డు  కౌన్సిలర్ దొడ్డిగర్ల కృష్ణ  బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు .
 

మరిన్ని వార్తలు