ఏసీబీకి చిక్కిన రాజీవ్ విద్యా మిషన్ డీఈ

3 Jun, 2015 15:37 IST|Sakshi

నెల్లూరు : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో బిల్లుల మంజూరు కోసం కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ కావలి రాజీవ్ విద్యా మిషన్ డీఈ సాంబశివారెడ్డి ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు... కావలి రాజీవ్ విద్యామిషన్‌కు చెందిన సర్వశిక్ష అభియాన్ డీఈగా పనిచేస్తున్న సాంబశివారెడ్డి బిల్లుల మంజూరు కోసం కాంట్రాక్టర్ నాగరాజు వద్ద నుంచి రూ.15వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. బిల్లుల మంజూరుకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని నాగరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

పట్టణంలోని కోర్టు సమీపంలో రూ. 15 వేల లంచం తీసుకుంటుండగా మాటువేసిన అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సాంబశివారెడ్డి నుంచి రూ.15 వేలు స్వాధీనం చేసుకుని కస్టడీలోకి తీసుకున్నారు. నెల్లూరు ఏసీబీ ఇన్‌చార్జ్ డీఎస్పీ మూర్తి ఆధ్వర్యంలో అధికారులు ఈ దాడిచేశారు. అలాగే సాంబశివారెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

మరిన్ని వార్తలు