టీడీపీకి కావ్య కృష్ణారెడ్డి గుడ్‌బై

4 Apr, 2019 10:26 IST|Sakshi
రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కావ్య కృష్ణారెడ్డి

నేడు జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక

మేకపాటి, ఆదాల, రామిరెడ్డి గెలుపునకు కృషి చేస్తానన్న కావ్య కృష్ణారెడ్డి

కావలి: టీడీపీ సీనియర్‌ నాయకుడు కావ్య కృష్ణారెడ్డి(దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి) బుధవారం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కావలిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీలో తనకు తీవ్ర అవమానాలు జరిగాయని, కానీ వాటిని తాను ఏ రోజూ బయట చెప్పలేదన్నారు. తన ఆత్మీయులు ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో ఉన్నారని, వారందరి అభిప్రాయం మేరకు తాను వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గురువారం నెల్లూరుకు రానున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతానని ప్రకటించారు. టీడీపీ ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి బొల్లినేని వెంకటరామారావును ఓడించి తీరుతానని, ఉదయగిరి ఎమ్మెల్యేగా మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

అలాగే కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని చారిత్రాత్మకమైన మెజార్టీతో గెలిపించడానికి కృషి చేస్తానని అన్నారు. ప్రధానంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కేవలం ఆరు రోజులు మాత్రమే ఉండడంతో ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో, వార్డుల్లో తన ఆత్మీయులు స్వచ్ఛందంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల తన తండ్రి మరణించినందున తాను ప్రతి ఇంటికి రాలేకపోతున్నానని, కానీ ప్రతి గ్రామం, వార్డులకు వచ్చి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. తన సొంత మండలమైన జలదంకిలో ఆదాల, మేకపాటిలకు భారీ మెజారిటీ తీసుకొస్తానని తెలిపారు.

ఎంపీ వేమిరెడ్డి చర్చలు
ఇటీవల కావ్య కృష్ణారెడ్డి తండ్రి మరణించిన నేపథ్యంలో ఆయనను పరామర్శించడానికి కావలిలోని కృష్ణారెడ్డి నివాసానికి వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో వేమిరెడ్డి రాజకీయ చర్చలు జరిపారు. అంతకుముందు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి చర్చలు జరిపారు.

మరిన్ని వార్తలు