ఈ లీకులేంది?

24 May, 2014 01:07 IST|Sakshi
ఈ లీకులేంది?

ఉద్యోగుల కేటాయింపు అంశంపై కేసీఆర్ అసంతృప్తి
 
 సాక్షి, హైదరాబాద్: విభజన కసరత్తు తీరుతెన్నులపై, ఉద్యోగులు, సచివాలయం, అసెంబ్లీ భవనాలు తదితరాల కేటాయింపు ప్రక్రియపై కాబోయే సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ జరుగుతున్న తీరుతో ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు పుట్టుకురావడమే తప్ప ఉన్నవి పరిష్కారమయ్యే అవకాశాల్లేవని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన ప్రక్రియ తీరుతెన్నులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, ఆర్థిక, నీటిపారుదల, ఇంధన, రెవెన్యూ తదితర 10 కీలక శాఖల అధికారులు శుక్రవారం లేక్‌వ్యూ అతిథి గృహంలో కేసీఆర్‌కు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు. ఉద్యోగుల కేటాయింపు అంశాన్ని అనవసరంగా గందరగోళం చేస్తున్నారని ఈ సందర్భంగా కేసీఆర్ అసంతృప్తి వెలిబుచ్చారు. దీనికి సంబంధించి పలు లీకులిస్తూ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇవన్నీ మార్గదర్శకాలకు అనుగుణంగా జరుగుతున్న తాత్కాలిక కేటాయింపులు మాత్రమేనని మహంతి వివరణ ఇచ్చారు. అపాయింటెడ్ డే అనంతరం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక ఉద్యోగుల ఆప్షన్లు ఇచ్చి, అందుకు అనుగుణంగా బదిలీ చేయవచ్చని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. ఆప్షన్లు ఇవ్వడమేమిటని కేసీఆర్ ప్రశ్నించగా, చట్టంలో అలాగే ఉందని అధికారులు వివరణ ఇచ్చారు. రెండు ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక ఇరువురు సీఎంలు, సీఎస్‌లు కూర్చుని సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉందని వారు సూచించారు. కానీ కేసీఆర్ ఉద్యోగుల అంశంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భవనాల కేటాయింపు అంశాన్ని ఉదహరించారు. ‘సచివాలయంలో భవనాలు కేటాయించారు.
 
 వాటి మధ్య ఉన్న రోడ్ల నిర్వహణను ఎవరు చేపట్టాల్సి ఉంటుంది?’ అని ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాలకూ అసెంబ్లీని ఒకే చోట పెట్టడం వల్ల లేనిపోని ఇబ్బందులొస్తాయన్నారు. వేర్వేరుగా కేటాయిస్తే సమస్యే ఉండేది కాదుగా అని ప్రశ్నించినట్లు సమాచారం. పైగా భవనాలను 58:42 నిష్పత్తిలో కేటాయించడాన్ని కూడా తప్పుబట్టారు. ఇదంతా... బంగ్లాదేశ్ విభజన సమయంలో హిందువులకు ఆస్తులు పంచే సమయంలో ఒక్కొక్కరూ ఒక్కో గది తీసుకోకుండా అన్ని గదులనూ నాలుగేసి భాగాలు చేసుకున్నట్టుగా ఉందన్నారు. ఇలా రోజూ కొట్లాడుకునే పరిస్థితి కల్పించడం సమంజసం కాదన్నారు. నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టుల అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించగా.. దాన్ని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ చూసుకుంటుందని వారు బదులిచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య వచ్చే సమస్యలకు ఇక్కడే ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించేలా చూడాలని కేసీఆర్ సూచించారు. వాటిని కేంద్రం దాకా తీసుకెళ్తే అనవసర  జాప్యం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారని ఓ అధికారి చెప్పారు.

>
మరిన్ని వార్తలు