కేసీఆర్ విజయోత్సవ ర్యాలీ షెడ్యూల్లో మార్పులు

26 Feb, 2014 10:44 IST|Sakshi
కేసీఆర్ విజయోత్సవ ర్యాలీ షెడ్యూల్లో మార్పులు

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హైదరాబాద్ వస్తున్న సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీ షెడ్యూల్లో మార్పులు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం  బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే కేసీఆర్ మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్ చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు బేగం పేట నుంచి గన్పార్క్ వరకూ ర్యాలీగా బయల్దేరతారు.
 
ర్యాలీ సాగేదిలా...
 
*మధ్యాహ్నం నాలుగు గంటలకు బేగంపేట విమానాశ్రయం వద్ద ర్యాలీ ఆరంభమవుతుంది.
*లైఫ్‌స్టైల్ బ్రిడ్జి, సోమాజిగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, రవీంద్రభారతి మీదుగా గన్‌పార్కు చేరుకుంటుంది. దాదాపు ఏడు కిలోమీటర్ల పొడువున ర్యాలీ సాగుతుంది.
* ర్యాలీ కొనసాగుతున్న సమయంలో బేగంపేట విమానాశ్రయం నుంచి నిజాం కాలేజీ వరకు కేసీఆర్ ప్రత్యేక వాహనంపై ఆసీనులవుతారు. అక్కడి నుంచి పాదయాత్రగా గన్‌పార్కుకు చేరుకుంటారు.
* ర్యాలీ మార్గమధ్యంలో తెలంగాణ బ్రాహ్మణ సంఘం తరఫున 1,000 మందితో పూర్ణకుంభ స్వాగతం పలుకుతారు. టీఆర్‌ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఐదు వేల మంది మహిళలు బోనాలతో అధినేతకు స్వాగతం చెబుతారు.
* ర్యాలీకి ముందు భాగాన వందల సంఖ్యలో గుర్రాలు, ఒంటెలు నడిచేలా ఏర్పాటు చేశారు.
* నాలుగైదు గంటల పాటు ర్యాలీ సాగుతుందన్న అంచనాలతో.. సామాన్య ప్రజలకు సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పార్టీ కార్యకర్తలు వాలంటీర్లుగా పనిచేయనున్నారు.
 

మరిన్ని వార్తలు