ఇదేం తీరు?

6 Jun, 2019 12:39 IST|Sakshi
కేడీసీసీ బ్యాంకు

ప్రభుత్వం మారినా.. పదవికి రాజీనామా చేయని కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌

మరోవైపు పదోన్నతులపై  పాలకవర్గం కసరత్తు

హడావుడిగా ఫైల్‌ సిద్ధం  చేసిన వైనం

అర్హత లేకున్నా.. ప్రమోషన్‌  ఇచ్చేందుకు పావులు!

సాక్షి, కృష్ణాజిల్లా, మచిలీపట్నం: కేడీసీసీబీ(ది కృష్ణా డిస్ట్రిక్ట్‌ కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌)లో పాలకవర్గం.. అధికారులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా పదోన్నతులు కల్పించేందుకు పావులు కదుపుతున్నారు. ఆగమేఘాల మీద దీనికి సంబంధించిన ఫైల్‌ను సిద్ధం చేసేశారు. నేడో రేపో ఇంటర్వ్యూలు చేపట్టి ప్రమోషన్లు ఇచ్చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.

ఇదీ విషయం
కేడీసీసీబీలో ఏడుగురిని అసిస్టెంట్‌ మేనేజర్‌ నుంచి మేనేజర్లుగా అక్రమ పదోన్నతులు కల్పించేందుకు పాలకవర్గం, అధికార యంత్రాం గం సిద్ధమవుతోంది. ఇందుకు తమ అనుయానులను ఎంపిక చేసుకుని తంతు సాగిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో పదోన్నతికి రూ.3 లక్షల వరకు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి.  ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎలాంటి పదోన్నతులైనా, ఉద్యోగ నియామకాలైనా వారి ఆధ్వర్యంలో చేపట్టాల్సి ఉంది. కానీ అలాంటి ప్రక్రియకు ఇక్కడ మంగళం పాడుతున్నారు. కొత్త ప్రభుత్వం వస్తే తమ ఆటలు సాగవనుకుని అడ్డగోలు యవ్వారానికి తెర తీసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మార్కులను ఏమార్చి!
పదోన్నతులకు అర్హత సాధించాలంటే సదరు ఉద్యోగికి అసిస్టెంట్‌ మేనేజర్‌గా అనుభవం, పీజీ పూర్తవ్వాలి. అంతేగాక బ్యాంకింగ్‌కు సంబంధించి డిప్లొమా కోర్సు చేసుండాలి. డీసీఆర్‌ఎస్, కంప్యూటర్‌ డిప్లొమాకు ప్రత్యేకంగా మార్కులు కేటాయిస్తారు. ఇదంతా ఒకెత్తయితే.. ఇంటర్వ్యూలకు 15 మార్కులు కేటాయిస్తారు. ఇక్కడే అసలు కథ నడిపిస్తున్నారు. ఇంటర్వ్యూల్లో తమకు అనుకూలమైన వారికి అధిక మార్కులు వేసి గట్టెక్కిం చేందుకు ఇప్పటికే ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. గతంలో జరిగిన పదోన్నతుల్లో సైతం ఇదే తంతు జరిగింది. అర్హులకు అన్యాయం చేసి.. అనర్హులకు పెద్దపీట వేశారు. ఈ సారి అదే ప్రక్రియ కొనసాగించేందుకు వ్యూహం రచిస్తున్నారు.

పదవీ కాలం ముగిసినా కొనసాగింపు?
పదోన్నతుల ఇంటర్వ్యూ బోర్డులో ముగ్గురు సభ్యులుంటారు. కేడీసీసీబీ చైర్మన్, సీఈఓ, ప్రొఫెషనల్‌ డైరెక్టర్‌ ఉంటారు. ఇందులో ప్రొఫెషనల్‌ డైరెక్టర్‌కు ఐదేళ్ల పదవీ కాలం ఉంటుంది. అనంతరం ఆ పదవిలో కొనసాగేందుకు అర్హత ఉండదు. కానీ ఇక్కడ మాత్రం పదవీ కాలం ముగిసినా అలాగే కొనసాగుతున్నారు. పదవీ కాలం ముగియడంతో ప్రొఫెషనల్‌ డైరెక్టర్‌ను తొలగించాలని నబార్డ్‌ నుంచి రిజిస్ట్రార్‌కు ఉత్తర్వులు అందాయి. రిజిస్ట్రార్‌ సైతం పాలకవర్గానికి సూచించినా.. తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న తలంపుతో ఏడాదిన్నర కాలంగా అలాగే కొనసాగిస్తున్నారు.  

చైర్మన్‌ రాజీనామావిషయమేంటి?
ప్రస్తుతం కేడీసీసీబీ చైర్మన్‌గా టీడీపీకి చెందిన పిన్నమనేని వెంకటేశ్వరరావు కొనసాగుతున్నారు. సాధారణంగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో నామినేటెడ్‌ పోస్టుల్లో కొనసాగుతున్న వారు నైతిక విలువలు పాటిస్తూ రాజీనామా చేయడం ఆనవాయితీ. 2004లో కౌంటింగ్‌ రోజున అప్పటి కేడీసీసీబీ చైర్మన్‌ సైతం రాజీనామా చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు రాజీనామా చేసిన దాఖలాలు సైతం లేకపోలేదు. కానీ ప్రస్తుత కేడీసీసీబీ పాలకవర్గానికి మాత్రం ఇది వర్తించదనుకున్నారో ఏమో నేటికీ రాజీనామా చేయకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు