మినీ మహానాడులో రచ్చకెక్కిన విభేదాలు

14 May, 2018 08:50 IST|Sakshi

ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, తుగ్గలి నాగేంద్ర మధ్య మాటల యుద్ధం 

సాక్షి, తుగ్గలి : టీడీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఆదివారం తుగ్గలిలో టీడీపీ నియోజవర్గ ఇన్‌చార్జ్‌ కేఈ శ్యాంబాబు అధ్యక్షతన జరిగిన మినీ మహానాడు అందుకు వేదికైంది. కార్యక్రమం ప్రారంభం కాగానే ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ స్టేజి మీద ఆశీనులయ్యారు. కొంతసేపటి తర్వాత శాలివాహన కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగేంద్ర తన భార్య జెడ్పీటీసీ సభ్యురాలు వరలక్ష్మితో కలిసి తప్పెట్ల హంగామాతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇదంతా చూస్తున్న ఎమ్మెల్సీ కేఈ.. తన ముందుగా వెళుతున్న నాగేంద్రను ఏదో అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. 

కేఈ ఘాటుగా మాట్లాడడంతో ప్రతిగా నాగేంద్ర..‘‘ఏయ్‌ మాట్లాడే విధానం నేర్చుకో భూస్థాపితం అవుతావు’’ అని హెచ్చరించారు. ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసు కోవడంతో కొద్ది సేపు అక్కడ ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఈ తతంగం అంతా టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఎదుటే జరగడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు. సోమిశెట్టి, శ్యాంబాబు, పోలీసులు, వేదిక మీద ఉన్న నాయకులు ఇద్దరికీ సర్ది చెప్పాల్సి వచ్చింది. అంతటితో ఆగకుండా సమావేశం ముగిసే వరకు మధ్యమధ్యలో వారి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. 

ఎమ్మెల్సీ ప్రభాకర్‌ మాట్లాడుతూ.. పత్తికొండలో ఎస్వీ మోహన్‌రెడ్డి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోందని ఇక్కడికి ఎవరూ రారని, కేఈ శ్యాంబాబే పోటీ చేస్తారన్నారు. రక్తమోడైనా విజయం కోసం పని చేస్తానన్నారు. తుగ్గలిలో 2009 సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేసినప్పుడు టీడీపీకి 23 ఓట్లు మాత్రమే మెజార్టీ వచ్చిందని, 2014లో వైఎస్సార్‌సీపీకి 240 ఓట్లు మెజార్టీ వచ్చిందని ఇక్కడ ఎవరూ ఏమీ పొడిచింది లేదంటూ పరోక్షంగా కేఈ నాగేంద్రను అనడంతో మరోసారి వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మొదటి నుంచి రికార్డులు చూసుకోవాలని నాగేంద్ర వాదించారు. ఇలా ఇద్దరి మధ్య పలుమార్లు మాటల తూటాలు పేలాయి. వీరి మధ్య విభేదాలు ఇప్పటివి కావని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు