కేరళ కేటుగాడు..

28 Oct, 2013 00:27 IST|Sakshi

 పరిగి, న్యూస్‌లైన్:
 పదమూడేళ్ల క్రితం వలస వచ్చాడు. చిన్నాచితక వ్యాపారాలు చేశాడు. అనంతరం ఓ బేకరీ ప్రారంభించి మంచి సేవలు అందిస్తూ స్థానికులకు నమ్మకంగా మెలిగాడు. ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద దాదాపు రూ. 50 లక్షల వరకు అప్పులు చేసి ఉడాయించాడు. ఆదివారం అసలు విషయం తెలుసుకున్న బాధితులు నిందితుడి బేకరీ వద్ద ఆందోళనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం.. కేరళ రాష్ట్రానికి చెందిన ముజీబ్(35) పదమూడు సంవత్సరాల క్రితం పరిగికి వలస వచ్చాడు. మొదట్లో చిన్నచిన్న  వ్యాపారాలు చేశాడు. దాదాపు ఐదేళ్ల క్రితం పరిగి పట్టణంలోని కృష్ణవేణి ట్యాలెంట్ స్కూల్ పక్కన రాయల్ పేరుతో ఓ బేకరీ ప్రారంభించాడు. పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ స్థానికులకు మంచి సేవలు అందించాడు. చాలా మందితో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నాడు. అనంతరం ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద దాదాపు రూ. 50 లక్షల వరకు అప్పులు చేశాడు. కొందరి వద్ద చిట్టీలు వేసి పాడుకున్నాడు.
 
  ఇటీవల బక్రీద్ పండుగకు మందుకు స్వస్థలానికి వెళ్తున్నట్లు స్థానికులకు చెప్పి వెళ్లాడు. పండుగ దాటి దాదాపు 15 రోజులు గడిచినా అతడి జాడ లేదు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు ఫోన్లు చేయడం ఆరంభించారు. ‘నేను దుబాయ్ వెళ్తున్నాను.. అక్కడికి వెళ్లాక మీ ఖాతాల్లో డబ్బులు వేస్తాను.. పరేషాన్ అవసరం లేదు’ అని నమ్మబలికాడు. ఆ తర్వాత ముజీబ్ ఫోన్లకు స్పందించడం మానేశాడు.  దీంతో ముజీబ్ తమకు టోకరా వేశాడని అనుమానించిన బాధితులు ఆదివారం సాయంత్రం అతడి బేకరీ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. అక్కడ ఉన్న సామగ్రిని కొందరు తీసుకెళ్లారు. కేరళ కేటుగాడి టోకరా విషయం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.
 
 
 

మరిన్ని వార్తలు